గుజరాత్ రాష్ట్రం బనస్కాంత జిల్లాలోని అంబాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. అక్కడ గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ కింజల్ పరీఖ్, ఒక గర్భిణికి సిజేరియన్ ద్వారా ప్రసవం (శస్త్రచికిత్స) చేస్తున్న సమయంలో దాన్ని వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ ప్రాంతంలో పెద్ద వివాదం రేగింది.
ఆపరేషన్ థియేటర్‌లో తీసిన ఈ వీడియోలో, ఆపరేషన్ టేబుల్‌పై ఉన్న మహిళా రోగి మరియు శస్త్రచికిత్స ప్రక్రియ స్పష్టంగా కనిపించినట్లు చెబుతున్నారు. రోగి వ్యక్తిగత వివరాలను, వైద్య చికిత్సకు సంబంధించిన దృశ్యాలను అనుమతి లేకుండా రికార్డ్ చేసి బహిరంగంగా ఎలా షేర్ చేశారని ప్రశ్నలు తలెత్తాయి. వీడియో తీయడానికి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి రోగి లేదా ఆమె కుటుంబ సభ్యుల నుంచి రాతపూర్వక అనుమతి తీసుకున్నారా అనే అంశంపై కూడా వివాదం నెలకొంది.
వైద్య నియమావళి ప్రకారం రోగుల గోప్యతను (ప్రైవసీని) కాపాడటం వైద్యుల ప్రధాన బాధ్యత. రోగి అనుమతి లేకుండా వైద్య చికిత్సకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలను రికార్డ్ చేసి పంచడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. అంతేకాకుండా, ఆపరేషన్ థియేటర్‌లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడంపై ఉన్న నిబంధనలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటన వైద్య రంగ నైతిక విలువలపై మరోసారి చర్చకు దారితీసింది.
వీడియో వైరల్ అయి వ్యతిరేకత పెరగడంతో ఆసుపత్రి యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. సంబంధిత లేడీ డాక్టర్ కింజల్ పరీఖ్‌కు ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ కోరుతూ నోటీసు జారీ చేశారు. ఈ వ్యవహారంలో నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం స్పష్టం చేసింది.

Leave a Reply