ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లా జైలులో ఉన్న బాంద్రా హత్య కేసు నిందితులు, మహిళా ఖైదీలైన ముస్కాన్, రవిత.. కర్వా చౌత్ పండుగ జరుపుకోవడానికి గాజులు, బొట్లు (బిందీలు) కావాలని అడగడం విస్మయానికి గురిచేస్తోంది.
‘సంజీవని మహిళా సంస్థ’ అనే స్వచ్ఛంద సంస్థ (NGO) ఆధ్వర్యంలో జైలులో ఉన్న మహిళా ఖైదీలకు పూజ కోసం మట్టి కుండలు, అలంకరణ వస్తువులను పంపిణీ చేస్తున్నారు. అయితే, ముస్కాన్, రవిత కూడా ఈ ఉపవాస దీక్షను పాటిస్తారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.
దీనిపై సీనియర్ జైలు సూపరింటెండెంట్ డాక్టర్ వీరేష్ రాజ్ శర్మ మాట్లాడుతూ.. “జైలు నిబంధనల ప్రకారం మహిళా ఖైదీలు తమ ఇష్టపూర్వకంగా కర్వా చౌత్ ఉపవాసం ఉండటానికి, పూజలు చేయడానికి అనుమతి ఉంది. ఇందుకు అవసరమైన పండ్లు, పూజా సామగ్రిని జైలు అధికారులే ఏర్పాటు చేస్తారు. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ జైలులో ఉంటే వారు కలుసుకోవడానికి అనుమతి ఇస్తారు. అయితే, ముస్కాన్ – సాహిల్, రవిత – అమర్దీప్.. వీరు చట్టబద్ధంగా భార్యాభర్తలు కానందున వారు జైలులో కలుసుకోవడానికి అనుమతి ఇవ్వలేం” అని స్పష్టం చేశారు.
మహిళా ఖైదీలకు వివిధ వృత్తి శిక్షణలు అందిస్తున్న సంజీవని సంస్థ, వారిని స్వయం ఆధారితంగా మార్చేందుకు కృషి చేస్తోంది. ఆ సంస్థ కార్యదర్శి పారుల్ బన్సాల్ మాట్లాడుతూ, “ముస్కాన్ ఇప్పటికే జైలులో బ్యూటీషియన్ కోర్సు, రాఖీల తయారీ శిక్షణ పూర్తి చేసింది. ప్రస్తుతం కొవ్వొత్తుల తయారీ శిక్షణలోనూ ఆమె ఎంతో ఆసక్తిగా పాల్గొంటోంది” అని తెలిపారు.
భర్త దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కోసం మహిళలు చేసే కర్వా చౌత్ ఉపవాసం కోసం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భర్తల హత్య కేసుల్లో అరెస్టయిన ఈ మహిళా ఖైదీలు అలంకరణ వస్తువులు అడగడం జైలు వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
