రాజస్థాన్: మేఘాలయలో భర్తను చంపిన సోనమ్ రఘువంశీ ఉదంతం తరహాలోనే రాజస్థాన్‌లో కూడా ఒక ఘోరమైన హత్య జరిగింది. తన ప్రియుడితో కలిసి జీవించడానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ఒక మహిళ తన భర్తను అతి దారుణంగా అంతం చేసింది.
భర్త ఆశిష్‌ను అతని భార్య అంజు, ఆమె ప్రియుడు సంజు మరియు మరో ఇద్దరు స్నేహితులు కలిసి పథకం ప్రకారం హత్య చేశారు. జనవరి 30 సాయంత్రం, మద్యం మత్తులో ఉన్న ఆశిష్‌ను వాకింగ్‌కు వెళ్దామని నమ్మించి అంజు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ మాటు వేసిన నిందితులు వేగంగా వచ్చిన కారుతో ఆశిష్‌ను ఢీకొట్టి, ఆపై గొంతు నులిమి చంపేశారు.
ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం దీనిని రోడ్డు ప్రమాదంగా నమ్మించడానికి అంజు ప్రయత్నించింది. వేగంగా వచ్చిన కారు తమను ఢీకొట్టిందని, కారులో ఉన్న వారు తన బంగారు నగలను దోచుకున్నారని, రక్తస్రావం కావడం వల్లే తన భర్త చనిపోయాడని పోలీసులకు తప్పుడు వాంగ్మూలం ఇచ్చింది. అయితే, మృతదేహంపై ఉన్న గాయాలను చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు పక్కనే ఉన్న అంజుకు కనీసం చిన్న గాయం కూడా కాకపోవడంతో పోలీసుల అనుమానం బలపడింది.
వివరాల్లోకి వెళ్తే.. అంజు తన పొరుగువాడైన సంజుతో ప్రేమలో ఉండేది. ఈ క్రమంలోనే ఆశిష్‌తో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లయినా సంజుతో తన సంబంధాన్ని కొనసాగించిన అంజు, భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. పథకం ప్రకారం ఆ రోజు సాయంత్రం ఆశిష్‌కు మద్యం తాగించి, నిర్మానుష్యమైన రోడ్డుపైకి తీసుకెళ్లింది. అక్కడ పొదల్లో దాక్కున్న సంజు, అతని స్నేహితులు ఆశిష్‌ను అటాక్ చేసి చంపారు. ఆపై అది ప్రమాదమని నమ్మించడానికి కారుతో తొక్కించారు.
నిందితులను పట్టుకోవడానికి అంజు ఫోన్ లొకేషన్ కీలకమైంది. ఘటన జరిగిన సమయంలో అంజు, సంజు ఇద్దరూ ఒకే చోట ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అంజు తన మొబైల్ ఫోన్ మరియు కమ్మలను పారేసి, రోడ్డుపై స్పృహ కోల్పోయినట్లు నటించింది. చివరకు పోలీసుల లోతైన దర్యాప్తులో అసలు నిజం బయటపడి నిందితులు పట్టుబడ్డారు.
