మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్డియాలజిస్ట్ (గుండె వైద్యుడు) డాక్టర్ కె.డి. సింగ్, తన మహిళా స్నేహితురాలితో కలిసి ఉండగా భార్యకు అడ్డంగా దొరికిపోయారు. ఆ తర్వాత డాక్టర్ గారి పరిస్థితి దారుణంగా మారింది. డాక్టర్ భార్య సదరు మహిళ జుట్టు పట్టుకుని నడిరోడ్డుపై నానా హంగామా చేశారు.
డాక్టర్ కె.డి. సింగ్ తన ప్రియురాలిని భార్య కబంధ హస్తాల నుండి విడిపించడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆ భార్య సదరు మహిళ జుట్టును వదలకుండా వీరంగం సృష్టించారు. ఈ గొడవను చూసేందుకు జనం భారీగా గుమిగూడారు. ఎవరో ఈ సీనంతటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
డెంటిస్ట్ వర్సెస్ కార్డియాలజిస్ట్
డాక్టర్ కె.డి. సింగ్ రేవాలోనే నంబర్-1 కార్డియాలజిస్ట్ మాత్రమే కాకుండా, అక్కడ ఒక పెద్ద నర్సింగ్ హోమ్‌ను కూడా నడుపుతున్నారు. ఆయన భార్య వృత్తిరీత్యా డెంటిస్ట్ (దంత వైద్యురాలు). గత కొంతకాలంగా భర్త ప్రవర్తనపై ఆమెకు అనుమానం కలగడంతో, తన భర్తపై నిఘా ఉంచడం ప్రారంభించారు.
నడిరోడ్డుపై హైవోల్టేజ్ డ్రామా
బుధవారం నాడు డాక్టర్ తన లగ్జరీ కారులో మహిళా స్నేహితురాలితో కలిసి వెళ్తుండగా, ఆయన భార్య ఆ కారును మధ్యలోనే అడ్డుకున్నారు. కారు తలుపు తీయగానే భర్త పక్కన మరో మహిళ ఉండటం చూసి ఆమెకు ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే ఆ మహిళను కారులో నుండి బయటకు లాగి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లడం ప్రారంభించారు.
ఆ సమయంలో డాక్టర్ తన భార్యను శాంతింపజేయడానికి విశ్వప్రయత్నం చేసినా ఆమె వినలేదు. డాక్టర్ గారు జనం తీస్తున్న కెమెరాల నుండి తన ముఖాన్ని దాచుకోవడానికి ప్రయత్నించారు, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయన వీడియో సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది.
