“ప్రేమతో అయినా.. బలవంతంగా అయినా.. గ్రీన్‌లాండ్‌ను దక్కించుకుంటాం”: వెనిజులా తర్వాత ట్రంప్ మరో సంచలనం!

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ ద్వీపంపై మరోసారి వివాదాస్పద ప్రక్రియను మొదలుపెట్టారు. ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో భాగం చేసుకోవడానికి తాము వెనకడుగు వేయబోమని, అది ప్రేమతో కుదరకపోతే బలవంతంగానైనా (జబర్‌దస్తీ) స్వాధీనం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

చైనా, రష్యాల భయం: ఐరోపా దేశాలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. చైనా లేదా రష్యా గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “మేము గ్రీన్‌లాండ్ విషయంలో ఏదో ఒకటి చేస్తాం, వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా.. ఎందుకంటే మేము చేయకపోతే రష్యా లేదా చైనా ఆ పని చేస్తాయి. మేము దానిని అనుమతించం” అని పేర్కొన్నారు.

వెనక్కి తగ్గేదే లే: “నేను గ్రీన్‌లాండ్ అంశాన్ని శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవాలనుకుంటున్నాను, కానీ అది సాధ్యం కాకపోతే కఠినమైన మార్గాన్ని అనుసరించడానికి వెనుకాడను. మాది అని మేము భావించే వస్తువును కాపాడుకుంటాం” అని ట్రంప్ తన ఉద్దేశాన్ని చాటి చెప్పారు. డెన్మార్క్ లేదా గ్రీన్‌లాండ్ ప్రజలు అంగీకరించినా లేకపోయినా తాము అనుకున్నది చేస్తామనే సంకేతాలు ఇచ్చారు.

అమెరికాకు గ్రీన్‌లాండ్ ఎందుకు ముఖ్యం? ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా మరియు చైనాల సైనిక కార్యకలాపాలు పెరుగుతున్న తరుణంలో, ఖనిజ సంపద అపారంగా ఉన్న గ్రీన్‌లాండ్ ద్వీపంపై నియంత్రణ సాధించడం అమెరికా జాతీయ భద్రతకు ఎంతో కీలకమని ట్రంప్ భావిస్తున్నారు.

డెన్మార్క్ హెచ్చరిక: ఈ వ్యాఖ్యలపై డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడరిక్సన్ తీవ్రంగా స్పందించారు. గ్రీన్‌లాండ్‌పై దాడి జరిగితే అంతా ముగిసిపోతుందని ఆమె హెచ్చరించారు. “గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించడానికి ఎవరు ప్రయత్నించినా, డెన్మార్క్ సైన్యం మొదట కాల్పులు జరుపుతుంది, ఆ తర్వాతే ప్రశ్నలు అడుగుతుంది” అని స్పష్టం చేశారు. గ్రీన్‌లాండ్‌పై సైనిక దాడి జరిగితే అది నాటో (NATO) కూటమి అంతానికి సంకేతమని ఆమె హెచ్చరించారు.


Posted

in

by

Tags: