బీహార్: ఒక వివాహిత తన ప్రియుడిని కలిసేందుకు వెళ్లగా, ఊహించని విధంగా అదే రోజు ఆమెకు ఆ ప్రియుడితోనే పెళ్లి జరిగింది. ఈ విచిత్ర ఘటన బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా, విభూతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధోపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఏం జరిగింది? 30 ఏళ్ల రాధని అనే మహిళకు ఏడేళ్ల క్రితం మనీష్ కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి 5 ఏళ్ల కొడుకు ఉన్నాడు. వివాహమైన కొద్ది కాలానికే భర్త మనీష్ పని నిమిత్తం హర్యానాకు వెళ్లాడు. గత 5 ఏళ్లుగా అతను తిరిగి రాకపోగా, భార్యాపిల్లలతో ఎటువంటి సంబంధం లేకుండా దూరంగా ఉంటున్నాడు. భర్త ఆచూకీ లేకపోవడంతో రాధని తన పుట్టింట్లో ఉంటూ వస్తోంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా రాధనికి 25 ఏళ్ల మయాంక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. బుధవారం సాయంత్రం వీరు మొక్కజొన్న చేలో కలుసుకున్నారు. అయితే వీరిద్దరిపై అనుమానం ఉన్న గ్రామస్థులు, వారిని పట్టుకుని గ్రామంలోని పంచాయతీ ముందుకు తీసుకొచ్చారు.
పంచాయతీ నిర్ణయం.. వివాహం: గ్రామస్తుల విచారణలో తాము ఒకరినొకరు ప్రేమిస్తున్నామని వారు అంగీకరించారు. దీంతో గ్రామ పెద్దలు చర్చించి, వారిద్దరికీ అక్కడే వివాహం జరిపించాలని నిర్ణయించారు. గ్రామస్థుల సమక్షంలో మయాంక్, రాధని నుదుట సింధూరం దిద్ది, ఆమెను తన భార్యగా స్వీకరించాడు. ఈ వివాహ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కొడుకుతో సహా కొత్త జీవితం: ఈ ఘటనలో అత్యంత భావోద్వేగకరమైన అంశం ఏమిటంటే, తన 5 ఏళ్ల కొడుకును కూడా రాధని తన కొత్త భర్త మయాంక్ ఇంటికి తీసుకువెళ్లింది. తన భర్త బాధ్యత లేకుండా దూరంగా ఉన్నాడని, భార్యను వదిలేశాడనే కారణంతో గ్రామస్థులు తీసుకున్న ఈ నిర్ణయం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. రాధని ఇప్పుడు తన కొడుకుతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
