“దొంగలు వచ్చారు సార్.. అందరినీ నరికి చంపేశారు. నేను పై అంతస్తులో ఉండటం వల్ల బతికిపోయాను” అంటూ 2008 ఏప్రిల్ 14న షబ్నం పోలీసుల ముందు ఏడుస్తూ చెప్పిన మాటలివి. ఎం.ఏ చదివి టీచర్‌గా పనిచేస్తున్న ఒక విద్యావంతురాలు తన కుటుంబాన్ని తానే చంపుకుంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ నిజాన్ని ఎంతకాలం దాచగలరు?
ఆ భయంకరమైన రాత్రి ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని భవన్ ఖేడ్ గ్రామంలో ఆ రాత్రి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ హసన్పూర్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, అక్కడ ఏడు మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. షబ్నం తండ్రి శౌకత్ అలీ, తల్లి హష్మి, సోదరులు అనీస్, రషీద్, వదిన అంజుమ్, బంధువు రబియా.. చివరకు ఊయలలో పడుకున్న పది నెలల చిన్నారి అర్ష్ కూడా గొంతు కోసి చంపబడ్డారు. ఆ ఇంట్లో ప్రాణాలతో మిగిలింది కేవలం 25 ఏళ్ల షబ్నం మాత్రమే.
పోలీసుల విచారణలో వీడిన మిస్టరీ:
కేసు దర్యాప్తు చేసిన సీనియర్ అధికారి ఆర్.పి. గుప్తాకు కొన్ని విషయాలు అనుమానం కలిగించాయి:
- పోరాటం జరిగిన గుర్తులు లేవు: చనిపోయిన వారు పడకలపైనే ప్రశాంతంగా నిద్రిస్తున్నట్టు ఉన్నారు.
- మత్తు మందు: బాధితుల శరీరంలో ‘బయోపోస్’ అనే మత్తుమందు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. అంటే భోజనంలో ఎవరో కావాలనే మత్తుమందు కలిపారు.
- ఫోన్ కాల్స్: షబ్నం ఫోన్ రికార్డులను పరిశీలించగా, ఆ రాత్రి ఆమె సలీమ్ అనే వ్యక్తితో 40 సార్లు మాట్లాడినట్లు తేలింది.
హత్య వెనుక అసలు కారణం:
సలీమ్ అనే వ్యక్తి షబ్నం ఇంటి పక్కనే ఉంటూ కూలి పనులు చేసుకునేవాడు. బాగా చదువుకున్న షబ్నంకు, చదువుకోని సలీమ్ మధ్య ఉన్న ప్రేమను ఇంట్లో వారు అంగీకరించలేదు. అప్పటికే గర్భవతి అయిన షబ్నం.. ఇంట్లో వారిని చంపేస్తే ఆస్తి మొత్తం తనకే వస్తుందని, సలీమ్‌తో కలిసి సుఖంగా బతకవచ్చని పథకం వేసింది.
షబ్నం తన కుటుంబ సభ్యులందరికీ భోజనంలో మత్తుమందు కలిపింది. అందరూ గాఢనిద్రలోకి వెళ్లాక సలీమ్‌ను గొడ్డలితో రప్పించింది. సలీమ్ ఒక్కొక్కరిని నరికి చంపుతుంటే ఆమె నిర్వికారంగా చూస్తూ నిలబడింది. ఆ సమయంలో పది నెలల చిన్నారి అర్ష్ మేల్కొని ఏడవడం మొదలుపెట్టాడు. ఆ పసికందుపై కూడా జాలి చూపని షబ్నం, తన సొంత చేతులతో ఆ చిన్నారి గొంతు నులిమి ఊపిరి తీసింది.
ఉరిశిక్ష ఖరారు:
హత్య జరిగిన తర్వాత గొడ్డలిని చెరువులో పడేసి, తనపై దాడి జరిగినట్లు నాటకమాడారు. కానీ పోలీసుల విచారణలో నిజం బయటపడి ఇద్దరూ అరెస్టయ్యారు. జైలులోనే షబ్నం ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది.
- 2010: కోర్టు వీరిద్దరికీ ఉరిశిక్ష విధించింది.
- ప్రస్తుత స్థితి: రాష్ట్రపతి ఆమె క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. మథుర జైలులో ఆమెను ఉరి తీయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్భయ దోషులను ఉరి తీసిన పవన్ జల్లాద్ చేతుల మీదుగానే షబ్నం ఉరిశిక్ష అమలు కానుంది.
