గుజరాత్ రాష్ట్రం వడోదర జిల్లాలో తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే కోపంతో, ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి సొంత తండ్రిని దారుణంగా హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఘటన వివరాలు: పద్రా తాలూకాకు చెందిన ఒక 30 ఏళ్ల వ్యక్తి తన ఇంట్లోనే కత్తిపోట్లతో శవమై కనిపించాడు. ఈ కేసును విచారించిన పోలీసులు, మృతుడి కుమార్తె (17) ఈ హత్య వెనుక మాస్టర్ మైండ్ అని తెలుసుకుని విస్తుపోయారు. తన ప్రియుడు రంజిత్ మరియు అతని స్నేహితుడు మహేష్‌లతో కలిసి ఆ బాలిక ఈ హత్యకు ప్లాన్ వేసింది. హత్య జరిగిన రోజు తండ్రి తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపి అతను స్పృహ కోల్పోయేలా చేసింది. అర్ధరాత్రి తన ప్రియుడిని ఇంటికి పిలిపించింది. ప్రియుడు, అతని స్నేహితుడు కలిసి తండ్రిని కత్తులతో పొడిచి చంపుతుంటే, ఆ బాలిక కిటికీ వెనుక నిలబడి ఎటువంటి చలనం లేకుండా ఆ దృశ్యాన్ని చూసింది.
హత్యకు ఇది మూడో ప్రయత్నం: పోలీసుల విచారణలో మరో షాకింగ్ విషయం బయటపడింది. ఆ బాలిక తన తల్లిదండ్రులను చంపడానికి ప్రయత్నించడం ఇది మొదటిసారి కాదు. గతంలో రెండుసార్లు విషం లేదా నిద్రమాత్రలు ఇచ్చి చంపాలని చూసింది. ఒకసారి తాగునీటిలో నిద్రమాత్రలు కలిపి తల్లికి ఇవ్వగా, ఆ నీరు చేదుగా ఉండటంతో ఆమె తాగలేదు. రెండు రోజుల క్రితం ఆహారంలో మాత్రలు కలిపినా ఆ ప్రయత్నం విఫలమైంది. చివరికి మూడోసారి పథకం ప్రకారం తండ్రిని నిద్రలోనే అంతం చేయించింది.
హత్యకు కారణం ఏంటి? నిందితుడైన ప్రియుడు రంజిత్ గతంలోనే ఈ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో ‘పోక్సో’ (POCSO) చట్టం కింద అరెస్ట్ అయ్యి, బెయిల్ మీద బయటకు వచ్చాడు. జైలు నుండి వచ్చిన తర్వాత కూడా ఆ బాలిక రంజిత్‌తో సంబంధాన్ని కొనసాగించింది. దీనిని తండ్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ క్రమంలో భార్య, కూతురు ఎవరినీ కలవకుండా గదిలో పెట్టి తాళం వేశాడు. దీంతో ఆగ్రహం చెందిన బాలిక, తండ్రిని చంపేసి ఊరు విడిచి పారిపోవాలని తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ప్రస్తుతం పోలీసులు ఆ బాలికను, ఆమె ప్రియుడిని మరియు అతని స్నేహితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
