ప్రైవేట్ క్లినిక్‌లు నడుపుతూ సొంత వ్యాపారాలా..? ప్రభుత్వ డాక్టర్లకు చెక్ పెట్టిన సుప్రీంకోర్టు.. ఇకపై నో ఛాన్స్.!!

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే వైద్యులు, నిబంధనలకు విరుద్ధంగా సొంతంగా ప్రైవేట్ క్లినిక్‌లు లేదా ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రాక్టీస్ చేయడాన్ని (వ్యాపారం చేయడాన్ని) ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెగేసి చెప్పింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని ఒక ప్రభుత్వ వైద్య కళాశాల (Government Medical College)లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, డాక్టర్లు చాలామంది సొంతంగా ప్రైవేట్ క్లినిక్‌లు నడుపుతున్నారని.. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద రోగులను తమ సొంత క్లినిక్‌లకు రావాలంటూ మళ్లిస్తున్నారని అలహాబాద్ హైకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలైంది.

హైకోర్టు సంచలన తీర్పు – ఉన్నత స్థాయి విచారణ:
ఈ పిటిషన్‌ను విచారించిన అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. “ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్‌గా ప్రాక్టీస్ చేయడంపై పూర్తి నిషేధం ఉంది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఆదేశించింది. అంతేకాకుండా, ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన డాక్టర్ – నిరాకరించిన న్యాయమూర్తులు:
హైకోర్టు ఇచ్చిన ఈ సంచలన ఆదేశాలపై స్టే (తాత్కాలిక నిషేధం) విధించాలని కోరుతూ సదరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంతోష్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.

ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.వి. నాగరత్న మరియు జస్టిస్ జాయ్‌మాల్మా బాగ్చీలతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి లేదా దానిపై స్టే విధించడానికి ముఖం చాటేసింది (పూర్తిగా నిరాకరించింది).

ప్రజా హితమే ముఖ్యం – పిటిషన్ కొట్టివేత:
“హైకోర్టు ప్రజల సంక్షేమానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాన్ని విచారిస్తోంది. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదనే హైకోర్టు ఉద్దేశం ముమ్మాటికీ సరైనదే” అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పు కేవలం ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఇచ్చింది కాదని.. నిబంధనలను ఉల్లంఘించే ప్రభుత్వ వైద్యులందరికీ వర్తిస్తుందని పేర్కొంటూ డాక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనితో ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేట్ సంపాదనపై కన్నేసే డాక్టర్లకు ఇకపై ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయి.


Posted

in

by

Tags: