‘ఫర్సా వాలే బాబా’ హత్యతో బ్రజ్ ప్రాంతంలో ఉద్రిక్తత! ఢిల్లీ-ఆగ్రా హైవే దిగ్బంధం, సీఎం యోగి సీరియస్

మథురలోని కోసీకలన్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రసిద్ధ గో సంరక్షక సాధువు బాబా చంద్రశేఖర్ (ఫర్సా వాలే బాబా) అనుమానాస్పద స్థితిలో మరణించారు. గోవులను అక్రమంగా తరలిస్తున్న ముఠా, బాబాను కావాలనే వాహనంతో తొక్కి చంపేసిందని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

అసలేం జరిగింది? శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొంతమంది స్మగ్లర్లు ఆవులను తరలిస్తున్నట్లు బాబా చంద్రశేఖర్‌కు సమాచారం అందింది. వెంటనే ఆయన తన బైక్‌పై వారిని వెంబడించారు. కోటవన్ చౌకీ ప్రాంతంలోని నవీపూర్ గ్రామ సమీపంలో స్మగ్లర్లు బాబా బైక్‌ను బలంగా ఢీకొట్టి, ఆయనపై నుండి వాహనాన్ని పోనిచ్చి పారిపోయారు. ఈ ప్రమాదంలో బాబా చంద్రశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

నిందితుల వేట: ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఒక యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వ్యక్తి వేరే వర్గానికి చెందినవాడని సమాచారం. అయితే మరో ముగ్గురు నిందితులు చీకటిని ఆసరాగా చేసుకుని పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

హైవేపై ఆందోళన: బాబా మరణవార్త తెలియగానే వందలాది మంది హిందూ సంఘాల కార్యకర్తలు, గో భక్తులు ఢిల్లీ-ఆగ్రా హైవే (NH-19) పైకి చేరుకుని రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆగ్రహించిన జనం పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

సీఎం యోగి ఆదేశాలు: ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ఈ విషయంలో త్వరితగతిన విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని స్పష్టం చేశారు.


Posted

in

by

Tags: