సోషల్ మీడియాలో పుట్టిన ప్రేమ కోసం ఒక భార్య, తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్త ప్రాణాలను తీసింది. ముందుగా రూ. 10,000 ఆశ చూపి భర్తను జార్ఖండ్ నుండి ఛత్తీస్‌గఢ్‌కు రప్పించి, రైల్వే ట్రాక్ పక్కన అత్యంత దారుణంగా హత్య చేయించింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్లో పరిచయమైన ప్రియుడితో కలిసి పూనమ్ అనే మహిళ తన భర్త వినోద్ లోమ్గాను చంపేసేందుకు పక్కా ప్లాన్ వేసింది. వీరికి ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
ప్రియుడితో కలిసి భర్త హత్య: బిలాస్‌పూర్‌లోని సిర్గిట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పూనమ్‌కు ఫేస్బుక్ ద్వారా జార్ఖండ్‌కు చెందిన సుగడ్ టోప్నోతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో, భర్త వినోద్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
రూ. 10,000 ఆశ చూపి రప్పించి: పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. పూనమ్ ప్రియుడు సుగడ్, వినోద్‌ను రూ. 10,000 ఇస్తామని నమ్మించి సిర్గిట్టికి పిలిపించాడు. మే 18, 2026న వినోద్, భార్య పూనమ్‌తో కలిసి బయలుదేరాడు. అయితే మే 20న పూనమ్ ఒక్కతే ఇంటికి తిరిగి వచ్చి, వినోద్ ఒక పని మీద అక్కడ ఆగిపోయాడని అబద్ధం చెప్పింది. అప్పటికే సిర్గిట్టి ప్రాంతంలో ప్రియుడు మరియు అతని స్నేహితులతో కలిసి పూనమ్, తన భర్త వినోద్‌ను దారుణంగా హత్య చేసి, శవాన్ని రైల్వే ట్రాక్ పక్కన పొదల్లో దాచిపెట్టారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బయటపడిన నిజం: మే 21 వరకు వినోద్ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు, జార్ఖండ్‌లోని జల్డేగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించగా, కీలక ఆధారాలు లభించాయి. నిందితురాలు పూనమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, తనే స్వయంగా డబ్బు ఆశ చూపి భర్తను పిలిపించి, ప్రియుడితో కలిసి చంపినట్లు ఒప్పుకుంది.
