“ఫొటో తీస్తే తప్పా..?” ఫొటోలు తీసి పోస్ట్ చేసిన మహిళకు మరణశిక్ష.. అత్యున్నత నాయకుడిని విమర్శించిన 33 ఏళ్ల బ్లాగర్.. ఇరాన్‌లో దారుణం..!!

ఇరాన్‌లో 33 ఏళ్ల ప్రముఖ మహిళా బ్లాగర్ సోదా ఇబ్రాహిమి షమ్సాబాదికి దేశ అత్యున్నత నాయకుడిని అవమానించారనే ఆరోపణలతో పాటు, జాతీయ భద్రతకు వ్యతిరేకంగా వ్యవహరించారనే అభియోగాలపై ఆ దేశ న్యాయస్థానం మరణశిక్ష విధించడం తీవ్ర కలకలం రేపింది.

క్షిపణి దాడి జరిగిన ప్రాంతానికి సంబంధించిన ఫొటోలను తీసి, వాటిని విదేశీ మీడియాకు పంపినందుకు ఆమెపై “భూమిపై అవినీతి, విధ్వంసానికి పాల్పడ్డారు” వంటి తీవ్రమైన అభియోగాలు మోపినట్లు సమాచారం. ఈ కేసులో ఆమెకు మరణశిక్ష విధించబడింది. గత మార్చి నెల నుంచి ఆమెను జైలులో ఏకాంత నిర్బంధంలో ఉంచినట్లు తెలుస్తోంది.

అరెస్టుకు ముందు, దేశంలో జరిగిన ఆందోళనలపై ధైర్యంగా పోస్టులు చేసిన సోదా ఇబ్రాహిమి.. “ఎన్ని నేరాలు, హత్యలు జరిగాయో చెప్పడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి” అంటూ సోషల్ మీడియాలో రాశారు.

తన చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఆమె, “ఒకరోజు నేను ఈ ప్రపంచాన్ని విడిచిపోతే, నేను నమ్మిన మార్గాన్ని నేనే ఎంచుకున్నానని తెలుసుకోండి” అంటూ భావోద్వేగపూరితమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఆమె తన మరణాన్ని ముందుగానే ఊహించినట్లుగా కనిపించాయి.

ఇరాన్‌లో ఇటీవల కాలంలో ప్రభుత్వాన్ని విమర్శించే, ప్రతిపక్ష స్వరాలను అణచివేయడంతో పాటు ప్రజల్లో భయాన్ని కలిగించేందుకు మరణశిక్షల అమలు పెరుగుతోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ ఏడాది మాత్రమే ఇరాన్‌లో వందలాది మందికి మరణశిక్షలు అమలు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యువ మహిళా బ్లాగర్ కేసు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.


Posted

in

by

Tags: