బెంగళూరుకు చెందిన 42 ఏళ్ల వ్యాపారవేత్త నూర్ నహిద్ ఖాన్ వాట్సాప్ నంబర్‌కు ఒక మెసేజ్ వచ్చింది. అందులో, “మా పెళ్లికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పూర్తి వివరాల కోసం కింద ఉన్న ఇన్విటేషన్‌ను డౌన్‌లోడ్ చేసి చూడండి” అని ఎంతో మర్యాదగా రాసి ఉంది. దానితో పాటు ఒక ఫైల్ కూడా పంపబడింది.
అది నిజమైన పెళ్లి పత్రికే అని నమ్మిన ఆయన, ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే (తెల్లవారుజామున 4.45 నుండి 4.54 గంటల మధ్య), ఆయన బ్యాంకు ఖాతా నుండి పలు యుపిఐ (UPI) లావాదేవీల ద్వారా రూ. 5,00,440 చోరీకి గురయ్యాయి.
ఈ మోసం ఎలా జరుగుతుంది?
సాధారణంగా పెళ్లి పత్రికలు ఫోటో రూపంలో (JPEG, PNG) లేదా డాక్యుమెంట్ (PDF) రూపంలో మాత్రమే వస్తాయి. కానీ, ఆ వ్యాపారవేత్తకు వచ్చింది .apk (Android Package Kit) అనే ఫార్మాట్‌లో ఉన్న ఫైల్.
ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఏదైనా కొత్త యాప్‌ను అఫీషియల్ ప్లే స్టోర్ కాకుండా బయటి నుండి ఇన్‌స్టాల్ చేయడానికి ఈ APK ఫైల్‌ను ఉపయోగిస్తారు. సైబర్ నేరగాళ్లు పెళ్లి పత్రిక పేరుతో ఒక ప్రమాదకరమైన స్పైవేర్ (గూఢచారి యాప్)ను ఈ APK ఫైల్ రూపంలో పంపిస్తారు. మనం దాన్ని కేవలం ఫోటో లేదా PDF అని అనుకుని క్లిక్ చేస్తాం.
మనం దాన్ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయగానే, ఆ యాప్ మన మొబైల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరికీ తెలియకుండా పనిచేయడం ప్రారంభిస్తుంది. మన మొబైల్‌లోని మెసేజ్‌లు (SMS), కెమెరా, గూగుల్ పే (GPay), మరియు బ్యాంకింగ్ యాప్స్‌తో సహా మొత్తం నియంత్రణ మోసగాళ్ల చేతికి వెళ్లిపోతుంది. బ్యాంకు నుండి వచ్చే ఓటిపి (OTP)ని వారే మన మొబైల్ నుండి చదివి, డబ్బును సులభంగా దొంగిలిస్తారు.
