ముంబైలో పీజీ డెంటిస్ట్రీ చదువుతున్న 24 ఏళ్ల యువతి, తన ప్రియుడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.
నివేదిక ప్రకారం.. మృతురాలిని స్తుతి సోన్వానేగా గుర్తించారు. ఆమె ఒక యువకుడితో రిలేషన్షిప్లో ఉంది. అయితే, అతను ఆమెను నిరంతరం అనుమానిస్తూ, ఆమె క్యారెక్టర్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ మానసిక వేదనకు గురిచేసేవాడు. స్తుతి రాసిన ఆరు పేజీల సుసైడ్ నోట్ లభ్యమైంది. తన బంధం ఎంత విషపూరితంగా (Toxic) మారిందో ఆమె అందులో వివరించింది.
‘ఫ్రిజ్‌లో కనిపిస్తావు’ – స్నేహితుల హెచ్చరిక
ఆశ్చర్యకరంగా, స్తుతి తన సుసైడ్ నోట్లో ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసును ప్రస్తావించింది. శ్రద్ధా వాకర్‌ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా చంపి, మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో దాచిన విషయం తెలిసిందే. స్తుతి స్నేహితులు ఆమె పడుతున్న ఇబ్బందులను చూసి.. “జాగ్రత్త, ఏదో ఒకరోజు నువ్వు కూడా ఫ్రిజ్‌లో దొరుకుతావు” (Fridge mein milegi) అని హెచ్చరించేవారట. ఆ మాటలనే ఆమె తన లేఖలో గుర్తు చేసుకుంది.
ఘటన నేపథ్యం:
ముంబైలోని ఆంటోప్ హిల్ ప్రాంతంలో తల్లిదండ్రులు, సోదరితో కలిసి స్తుతి నివసించేది. సోమవారం ఉదయం 11 గంటలైనా ఆమె గది నుండి బయటకు రాలేదు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టి చూడగా, స్తుతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె ప్రియుడి పాత్రపై విచారణ జరుపుతున్నారు.
