విమానంలో పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా క్రికెట్ లెజెండ్ ఎం.ఎస్. ధోని మీ కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది?
ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎయిర్ హోస్టెస్ ఐశ్వర్య సింగ్‌కు అలాంటి ఒక అరుదైన, మరువలేని అవకాశం దక్కింది.
విమానంలో ప్రయాణించిన భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనిని నేరుగా చూసిన ఐశ్వర్య, తన సంతోషాన్ని తలచుకుని ఉప్పొంగిపోయారు. ధోనిని ‘ది మిత్ అండ్ ది లెజెండ్’ (The Myth and The Legend) అని అభివర్ణిస్తూ, ఆయనతో మాట్లాడిన మధుర క్షణాలను వీడియోగా తీసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు.
ఆ వీడియోలో, ఆ రోజు తనకు ఎదురైన పనిభారం మరియు కఠినమైన పని వాతావరణం గురించి ధోనితో ఐశ్వర్య మాట్లాడుతుంది. దానిని ఎంతో ఓపికగా, ప్రశాంతంగా విన్న ధోని, ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని, పనిభారం అధికంగా ఉండే రోజులను ఎంత సులువుగా ఎదుర్కోవాలో ఒక ‘కూల్’ అడ్వైజర్‌లా కొన్ని చక్కటి సలహాలు అందించారు.
అంతేకాకుండా ధోని చెప్పిన ఒక సరదా జోక్‌కి ఐశ్వర్య నవ్వుతున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. పని ఒత్తిడితో అలసిపోయిన ఆ రోజున, ధోనితో జరిగిన ఈ చిన్నపాటి సంభాషణ తన జీవితంలో ఒక అద్భుతమైన కల నెరవేరిన క్షణం అని ఐశ్వర్య భావోద్వేగంతో పేర్కొన్నారు.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 18 లక్షలకు పైగా వ్యూస్‌ను దాటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు “ధోనిని కలిసే అదృష్టం మీకు దక్కింది” అంటూ అభినందనలు తెలుపుతుంటే, మరికొందరు “మిమ్మల్ని చూస్తే మాకు అసూయగా ఉంది” అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ధోని నిరాడంబరమైన వ్యక్తిత్వం, అభిమానులపై ఆయన చూపే ఆప్యాయత మరోసారి క్రికెట్ ప్రేమికుల మనసులను గెలుచుకుంది.
Leave a Reply