ఎయిర్ హోస్టెస్ అవ్వాలనే కల కొంతమందికి ఉండటం సహజమే. ఈ ఉద్యోగం వస్తే చాలు, విమానంలో ఎగురుతూ ప్రపంచమంతా చుట్టేయవచ్చనే ఆశ చాలా మందిలో ఉంటుంది.
అంతేకాకుండా, విమానయాన సంస్థలు తమ ఎయిర్ హోస్టెస్‌లకు వివిధ రకాల అలవెన్సులు, వసతితో కూడిన సదుపాయాలను భారీగా అందిస్తాయి. కానీ, అదే సమయంలో ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత వారు పలు కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఏ కారణం చేతనైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు కూడా తీసుకుంటారు.
ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం అనేది చాలా మందికి ఇష్టమైనది కావడంతో, ఈ ఉద్యోగం గురించి సమాజంలో పలు రకాల అభిప్రాయాలు, అపోహలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది, “ఒక అమ్మాయి ఎయిర్ హోస్టెస్ అయితే, ఆమె జీవితంలో ఇక పెళ్లే చేసుకోలేదు” అనేది. ఎయిర్ హోస్టెస్‌లు పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉండదని చాలా మంది బలంగా నమ్ముతారు. అయితే, దీని వెనుక ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం.
నిజానికి, ఎయిర్ హోస్టెస్‌ల జీవితం కూడా మిగిలిన సాధారణ మహిళల జీవితం లాంటిదే. విధుల్లో ఉండే సమయం మినహా వారి అంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది. మిగిలిన మహిళల లాగే ప్రేమించడానికి, తమకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి వారికి పూర్తి హక్కు ఉంది.
కాబట్టి, ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసే మహిళలు నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. వారు పెళ్లి చేసుకోకూడదనే ఎలాంటి నిషేధాన్ని లేదా ఆంక్షలను విమానయాన సంస్థలు విధించవు. అంతేకాకుండా, వివాహం తర్వాత సంస్థ నిబంధనల ప్రకారం వారికి తగిన సెలవులు కూడా మంజూరు చేస్తారు. మహిళలు ఈ ఉద్యోగంలో చేరడానికి ముందు లేదా చేరిన తర్వాత, ఎప్పుడైనా తమ ఇష్టప్రకారం వివాహం చేసుకోవచ్చనేదే నిజమైన వాస్తవం.
