భారతదేశంలో రోజురోజుకూ పెరుగుతున్న బంగారపు దిగుమతులను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన చర్యను ప్రకటించింది.
ముఖ్యంగా నగల దుకాణాలు, ఆభరణాల తయారీదారులు ఉపయోగించే “అడ్వాన్స్ ఆథరైజేషన్” (Advance Authorisation) పథకం కింద బంగారపు దిగుమతులపై కొత్త ఆంక్షలు విధించారు. విదేశీ మారకద్రవ్య నిల్వలపై (Foreign Exchange Reserves) పెరుగుతున్న ఒత్తిడి, ముడి చమురు ధరల పెరుగుదల మరియు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణాల వల్ల ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
100 కిలోల పరిమితి..
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) జారీ చేసిన కొత్త నోటిఫికేషన్ ప్రకారం.. ఇకపై అడ్వాన్స్ ఆథరైజేషన్ పథకం కింద గరిష్టంగా 100 కిలోల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తారు. ఈ పథకం ద్వారా, ఎగుమతి ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను ఎటువంటి కస్టమ్స్ సుంకం (Customs Duty) లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉండేది. ముఖ్యంగా ఆభరణాల ఎగుమతి సంస్థలు ఈ పథకాన్ని ఎక్కువగా ఉపయోగించుకునేవి. అయితే ప్రస్తుతం బంగారపు దిగుమతుల పరిమాణం భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం నిఘాను కఠినతరం చేసింది.
మొదటిసారి దరఖాస్తు చేసుకునే వారికి తనిఖీలు
కొత్త నిబంధనల ప్రకారం.. మొదటిసారిగా అడ్వాన్స్ ఆథరైజేషన్ ద్వారా బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి దరఖాస్తు చేసుకునే కంపెనీల ఉత్పాదక కేంద్రాలలో (Production Sites) తప్పనిసరిగా భౌతిక తనిఖీలు నిర్వహిస్తారు. అంటే, సదరు సంస్థ యొక్క ఉత్పాదక కేంద్రం నిజంగానే పనిచేస్తోందా, దాని ఉత్పత్తి సామర్థ్యం ఎంత, ఫ్యాక్టరీ నడుస్తున్న స్థితిలో ఉందా లేదా అనే విషయాలను DGFT ప్రాంతీయ అధికారులు స్వయంగా పరిశీలించి ధృవీకరించాలి. ఈ చర్య ద్వారా నకిలీ కంపెనీలు బంగారం దిగుమతి చేసుకోకుండా నిరోధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఎగుమతి చేస్తేనే తదుపరి అనుమతి
ప్రస్తుతం తీసుకొచ్చిన నిబంధనల్లో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. ఒక కంపెనీ గతంలో పొందిన అనుమతి కింద దిగుమతి చేసుకున్న 100 కిలోల బంగారంలో కనీసం 50 శాతాన్ని ఆభరణాల రూపంలో విదేశాలకు ఎగుమతి చేస్తేనే, తదుపరి విడత బంగారపు దిగుమతికి అనుమతి లభిస్తుంది. దీని ద్వారా దిగుమతి చేసుకున్న బంగారం నిజంగా ఎగుమతి ఉత్పత్తి కోసమే ఉపయోగించబడుతుందా లేదా అని ప్రభుత్వం పర్యవేక్షించగలదు. ఇది నగల పరిశ్రమలో పారదర్శకతను పెంచే చర్యగా పరిగణించబడుతోంది.
అంతేకాకుండా, బంగారం దిగుమతి చేసుకునే కంపెనీలు ఇకపై ప్రతి రెండు వారాలకు ఒకసారి తమ దిగుమతి మరియు ఎగుమతి వివరాలను చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ధృవీకరణతో సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, ప్రాంతీయ అధికారులు ప్రతి నెలా ఒక సమగ్ర నివేదికను DGFT ప్రధాన కార్యాలయానికి పంపాలి. దీని ద్వారా బంగారపు వ్యాపారంపై కేంద్ర ప్రభుత్వం తన ప్రత్యక్ష పర్యవేక్షణను పెంచుతోంది.
దిగుమతి సుంకం పెంపు
ఈ కొత్త ఆంక్షలు అమలులోకి రావడానికి ఒక రోజు ముందే, కేంద్ర ప్రభుత్వం బంగారం మరియు వెండిపై దిగుమతి సుంకాన్ని (Import Duty) 6 శాతం నుండి 15 శాతానికి పెంచింది. దీనికి ముందే బంగారం, వెండి దిగుమతులపై 3 శాతం ఐజీఎస్టీ (IGST) కూడా విధించారు. ఈ వరుస చర్యలు భారతదేశంలో అనవసరమైన దిగుమతులను తగ్గించి, విదేశీ మారకద్రవ్య నిల్వలను రక్షించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
