బంగారం ధర రోజురోజుకూ పెరిగిపోతుండటంతో సామాన్యులు నగలు కొనాలనే ఆలోచన కూడా చేయలేకపోతున్నారు. మరోవైపు, కష్టపడి దాచుకున్న నగలను దొంగిలించే ముఠాలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అసలేం జరిగింది? మలప్పురం జిల్లా మంబాడ్ ప్రాంతానికి చెందిన ఒక యువతి తన రెండేళ్ల చిన్నారికి ఒంట్లో బాలేకపోవడంతో చికిత్స నిమిత్తం నిలంబూర్‌లోని ఒక ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్ రావడానికి ఆలస్యం కావడంతో వరాండాలో వేచి చూస్తోంది. ఆ సమయంలో చిన్నారి అక్కడే ఆడుకుంటోంది. కొద్దిసేపటి తర్వాత గమనించగా, చిన్నారి మెడలో ఉన్న మూడున్నర గ్రాముల బంగారు గొలుసు మాయమైంది. ఆందోళన చెందిన తల్లి చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది.
ప్రేమగా నటిస్తూ దొంగతనం: అక్కడ ఉన్న వారిని విచారించగా, ఒక మహిళ ఆ పాపను చాలా సేపటి వరకు ఎంతో ప్రేమగా ముద్దాడుతూ ఆడుకుందని తెలిసింది. అనుమానంతో ఆ మహిళను (సమీనా, 35) నిలదీయగా, తనకు ఏమీ తెలియదని బుకాయించింది. మాట మార్చి మాట్లాడుతూ అందరిలోనూ అనుమానం కలిగించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి విచారించినా ఆమె నోరు విప్పలేదు.
ఎక్స్‌రేలో బయటపడ్డ నిజం: ఆమె నగను ఎక్కడైనా దాచి ఉండవచ్చు లేదా మింగేసి ఉండవచ్చు అని అనుమానించిన పోలీసులు, ఆమెను కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్‌రే తీయించారు. రిపోర్టులు చూసి డాక్టర్లు, పోలీసులు అవాక్కయ్యారు. ఆ బంగారు గొలుసు ఆమె కడుపులో ఉన్నట్లు ఎక్స్‌రేలో స్పష్టంగా కనిపించింది. దీంతో తప్పించుకోలేక ఆమె నిజాన్ని ఒప్పుకుంది. దొరికిపోతాననే భయంతో గొలుసును నోట్లో వేసుకుని మింగేసినట్లు అంగీకరించింది.
పెద్ద ట్విస్ట్: ప్రస్తుతం అసలైన సమస్య ఏమిటంటే.. కడుపులో ఉన్న నగ బయటకు రావడం లేదట! సహజ పద్ధతిలో నగ బయటకు రావడానికి డాక్టర్లు ఆమెకు ‘ఎనిమా’ ఇచ్చారు. పోలీసులు ఆమెను ఆసుపత్రిలోనే ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నగ బయటకు రాకపోవడంతో, సర్జరీ ఏమైనా చేయాలా అనే కోణంలో నిపుణులతో పోలీసులు చర్చిస్తున్నారు.
