బంగారు ధరలు (Gold price) నిలకడ లేకుండా పెరగడం, తగ్గడం చూస్తుంటే నగలు కొనేవారు షాక్‌కు గురవుతున్నారు. ఈ విపరీతమైన ధరల పెరుగుదల వల్ల నగల వ్యాపారులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ముందస్తు ఆర్డర్లు (Advance Orders) తీసుకోవడానికే వారు భయపడి వెనకడుగు వేస్తున్నారు. అసలు నగల వ్యాపారులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? వారు ఆర్డర్లు ఎందుకు తీసుకోవడం లేదో వివరంగా చూద్దాం.
బంగారం ధర ఎవరూ ఊహించని విధంగా గరిష్ట స్థాయికి చేరుతోంది. గతేడాది నుండి జెట్ వేగంతో దూసుకుపోతున్న పసిడి ధర, ఈ ఏడాది మెరుపు వేగంతో ముందుకు వెళ్తోంది.
చారిత్రాత్మక గరిష్టానికి బంగారం ధర: ప్రపంచవ్యాప్త యుద్ధ భయాలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు బంగారంపై మొగ్గు చూపుతున్నారు. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం కూడా దీనికి ప్రధాన కారణం. గత జనవరి 29న చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 8 గ్రాములు పై రూ. 9,520 పెరిగి సామాన్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ రోజు తులం బంగారం ధర రూ. 1,34,400కి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది.
షాపుల్లో తగ్గిన అమ్మకాలు: కేవలం రెండు రోజుల్లోనే (జనవరి 28, 29) 8 గ్రాములుపై రూ. 14,720 పెరగడంతో నగల షాపులన్నీ వెలవెలబోయాయి. అయితే నిన్నటి నుండి ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టడం సామాన్యులకు కొంత ఊరటనిస్తోంది. కానీ, నగల వ్యాపారుల పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది.
నగల వ్యాపారుల ఆవేదన: ధర పెరిగితే వ్యాపారులకు లాభాలు వస్తాయని అందరూ అనుకుంటారు, కానీ వాస్తవానికి ధరల్లో ఈ అనిశ్చితి వారికి పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా పెద్ద నగల వ్యాపారులు ముందస్తు ఆర్డర్లు తీసుకోవడం ఆపేశారు. ధర విపరీతంగా పెరగడం లేదా తగ్గడం వల్ల ఆర్డర్లను నిర్ధారించడం, స్టాక్ నిర్వహించడం కష్టతరమవుతోందని వారు చెబుతున్నారు.
వ్యాపారులు ఏమంటున్నారు? రోజులో జరిగే చిన్న ధర మార్పు కూడా తమ లాభాలను తుడిచిపెట్టేస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. వినియోగదారులు కూడా ధరలు తగ్గుతాయని కొనుగోళ్లను వాయిదా వేయడం లేదా ముందుగా ఇచ్చిన ఆర్డర్లలో బరువు తగ్గించుకోవడం వంటివి చేస్తున్నారు. మద్రాస్ గోల్డ్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శాంతకుమార్ మాట్లాడుతూ.. “ధరల్లో ఇంతటి భారీ హెచ్చుతగ్గుల వల్ల ఆర్డర్లు తీసుకున్నప్పుడు మొత్తం సొమ్ము లేదా 75% నగదు ముందుగానే చెల్లించాల్సి వస్తోంది. ధరల అస్థిరత వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది” అని తెలిపారు.
