గత కొన్ని రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ, భారీ మార్పు ఏదీ కనిపించలేదు. అయితే, త్వరలోనే బంగారం ధరలు ఊహించని విధంగా పతనమై, (8 గ్రాములు) ధర లక్ష రూపాయల కంటే తక్కువకు రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎందుకీ హఠాత్తు మార్పు? – డాలర్ వర్సెస్ రష్యా
అమెరికా, రష్యాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ, అంతర్జాతీయ వాణిజ్యం కోసం రష్యా ఇన్నాళ్లూ అమెరికా డాలర్‌నే వాడుతూ వచ్చింది. అయితే, 2014లో క్రిమియాను, 2022లో ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించుకున్నప్పుడు అమెరికా కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించింది. రష్యాకు చెందిన సుమారు $300 బిలియన్ల (రూ. 27 లక్షల కోట్లు) విదేశీ మారక నిల్వలను అమెరికా స్తంభింపజేసింది.
బంగారం వైపు ప్రపంచ దేశాల చూపు
అమెరికా చర్యతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. “ఈరోజు రష్యాకు జరిగింది రేపు మనకూ జరగొచ్చు” అని భావించి, డాలర్ నిల్వలను తగ్గించుకుని బంగారాన్ని నిల్వ చేయడం ప్రారంభించాయి.
- భారతదేశం: 2005లో విదేశీ నిల్వల్లో బంగారం వాటా కేవలం 4.3% ఉండగా, 2025 నాటికి అది 15%కి పెరిగింది.
- చైనా: గత 25 ఏళ్లలో తన బంగారం నిల్వలను 483% పెంచుకుంది. ప్రపంచ దేశాలన్నీ టన్నుల కొద్దీ బంగారాన్ని కొనడం ప్రారంభించడంతో డిమాండ్ పెరిగి, ధరలు ఆకాశాన్ని తాకాయి.
రష్యా-అమెరికా మధ్య కుదిరిన ‘డీల్’?
ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. అమెరికా, రష్యాలు చర్చల ద్వారా ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం ముగిసిన తర్వాత అంతర్జాతీయ వాణిజ్యం కోసం రష్యా తిరిగి డాలర్‌ను వాడటానికి సిద్ధమవుతోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, రష్యా ఏడు అంశాలతో కూడిన ప్రతిపాదనను సిద్ధం చేసింది.
రష్యా మళ్లీ డాలర్ వాడటం ప్రారంభిస్తే, తన వద్ద ఉన్న భారీ బంగారు నిల్వలను విక్రయించే అవకాశం ఉంది. రష్యాను అనుసరించి మరికొన్ని దేశాలు కూడా బంగారాన్ని విక్రయిస్తే మార్కెట్లో సప్లై పెరిగి ధరలు తగ్గుతాయి.
నిపుణులు ఏమంటున్నారు?
HDFC సెక్యూరిటీస్ నిపుణులు అనుజ్ గుప్తా అభిప్రాయం ప్రకారం.. “కేంద్ర బ్యాంకులు బంగారం కొనడం తగ్గిస్తే ధరలు భారీగా పడిపోతాయి. రష్యా డాలర్ వైపు మొగ్గు చూపితే, పెట్టుబడులన్నీ బంగారం నుండి డాలర్ వైపు మళ్లుతాయి.”
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు $3,000 కంటే తగ్గవచ్చని అంచనా. అదే జరిగితే, భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల లోపుకు పడిపోవచ్చు. అంటే గ్రాము ధరలో రూ. 1,000 వరకు (8 గ్రాములుపై రూ. 10,000) తగ్గుదల కనిపించవచ్చు.
