బ్రెసిలియా: బ్రెజిల్ దేశంలో ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ‘బంగీ జంప్’ సాహసం చేయడానికి వచ్చిన ఒక 21 ఏళ్ల యువతిని, అక్కడి సిబ్బంది 130 అడుగుల ఎత్తు నుండి కిందకు నెట్టేశారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆ సమయంలో ఆమె శరీరానికి రక్షణ కల్పించే ముఖ్యమైన ‘బంగీ తాడు’ను కట్టడం సిబ్బంది పూర్తిగా మరిచిపోయారు. దీంతో ఆ యువతి నేరుగా పైనుంచి కిందపడి అక్కడికక్కడే పరితాపకరంగా మృతి చెందింది.
జీవితంలో ఒక్కసారైనా ‘బంజీ జంప్’ ప్రయత్నించాలని చాలా మంది అనుకుంటారు. కానీ, మరికొందరు మాత్రం అంతటి ఎత్తు నుండి ఒంటికి తాడు కట్టుకుని కిందకు దూకడం చూసి.. అమ్మో! ఎంత ధైర్యంగా దూకుతున్నారో అని వీడియోలు చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇలాంటి ఒక సాహస క్రీడలోనే, తన కాబోయే భర్తతో కలిసి బంజీ జంప్ చేయాలనుకున్న ఒక యువతి.. సిబ్బంది చేసిన ఘోర నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది.
అసలేం జరిగిందంటే?
బ్రెజిల్‌లోని సావో పాలో ప్రావిన్స్‌లో ఉన్న ‘స్కెలెటన్ బ్రిడ్జ్’ (Skeleton Bridge) పై ఈ బంజీ జంపింగ్ పాయింట్ ఉంది. మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రీటాస్ (21) అనే యువతి తన ప్రియుడు/కాబోయే భర్తతో కలిసి అక్కడికి వెళ్లింది. అక్కడ 130 అడుగుల ఎత్తు నుండి దూకే బంజీ జంప్ ఆడటానికి మరియా ఎంతో ఆసక్తి చూపించింది. సాధారణంగా ఇక్కడ ప్రతి ఒక్కరి శరీరానికి బలమైన రక్షణ తాడు కట్టి కిందకు వదులుతారు.
ఈ క్రమంలోనే మరియా కూడా దూకడానికి సిద్ధమైంది. అయితే, అక్కడ ఉన్న బంజీ జంప్ సిబ్బంది ఆమె శరీరానికి కట్టాల్సిన ‘సేఫ్టీ రోప్’ (Safety Rope) ను కట్టలేదు. ఆ తాడు కట్టకుండానే నిర్లక్ష్యంగా ఆమెను 130 అడుగుల ఎత్తు నుండి కిందకు తోసేశారు. దీంతో నేరుగా కింద పడిపోయిన మరియా తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించింది. ఈ ఘోరానికి కారణమైన ఆరుగురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
“తాడు ఎక్కడ?” అని అరిచిన జనం..
మరియా 130 అడుగుల ఎత్తు నుండి కిందపడి మరణించిన ఈ భయంకరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మరియా పైనుంచి కింద పడటం ప్రారంభించగానే, అక్కడ ఉన్న ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతితో “అయ్యో.. తాడు ఎక్కడ?” అని గట్టిగా అరిచిన శబ్దాలు రికార్డయ్యాయి.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తను చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందే, మరియా తన సోషల్ మీడియా ఖాతాలో తన చేతికి కట్టుకున్న జంపింగ్ బ్యాండ్లను ఫోటో తీసి పోస్ట్ చేసింది. అందులో.. “ఈ బంగీ జంప్ బ్రిడ్జ్ నుండి నన్ను దూకడానికి అనుమతించిన ఆ పిచ్చోడు ఎవరు?” అని సరదాగా రాసుకొచ్చింది. ఆమె చేసిన ఈ చివరి పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారి అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.
ఈ ఘోర ప్రమాదం మరియా కళ్లెదుటే జరగడంతో ఆమె కాబోయే భర్త తీవ్ర దిగ్భ్రాంతికి (Shock) లోనయ్యాడు. కళ్లముందే ప్రియురాలు ప్రాణాలు కోల్పోవడంతో అతను గుండెలవిసేలా రోదించాడు. ప్రస్తుతం అతను తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply