బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన షేక్ హసీనా..! “సైనిక విమానం ఎక్కిన రహస్య వీడియోను లీక్ చేసిన మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి”.. అర్ధరాత్రి 1:35 గంటలకు వచ్చిన మెసేజ్. నదిలో శవమై తేలడం వెనుక సంచలన నేపథ్యం.!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోతున్న వీడియో లీకేజీ వివాదంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ దేశ మాజీ ఎయిర్‌ఫోర్స్ (వైమానిక దళ) అధికారి కే.ఎం. తహ్సీఫ్ సూరీ (28), రాజధాని ఢాకాలోని తురగ్ నదిలో శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది.

అక్టోబర్ 27న అదృశ్యమైన అతని మృతదేహాన్ని మరుసటి రోజు మధ్యాహ్నం వెలికితీశారు. 2024 ఆగస్టు 5న హసీనా పారిపోయిన వీడియోకు సంబంధించి సూరీ నిరంతరం మానసిక బెదిరింపులు, ఇంటెలిజెన్స్ నిఘాను ఎదుర్కొన్నాడని, అతడిని హత్య చేసి ఉంటారని అతని కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికరమైన ఆరోపణలు చేస్తున్నారు.

గత మంగళవారం సాయంత్రం తన తల్లితో “స్నేహితులను కలిసి వస్తాను” అని చెప్పి బయటకు వెళ్లిన సూరీ, అర్ధరాత్రి 1.35 గంటలకు “అమ్మా, వస్తున్నాను” అని మెసేజ్ చేశాడు. కానీ, ఆ తర్వాత అతను ఇంటికి తిరిగి రాలేదు. మరుసటి రోజు సాయంత్రం ఉత్తరఖాన్ ప్రాంతంలోని రాజబారి ఘాట్ సమీపంలో నదిలో తేలుతున్న అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతని జేబులో ఉన్న ఐఫోన్ ద్వారా అతడిని గుర్తించారు. అతని శరీరంపై ఎలాంటి బాహ్య గాయాలు లేవని చెబుతున్న పోలీసులు, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి అసలు కారణం తెలుస్తుందని పేర్కొన్నారు.

2024లో బంగ్లాదేశ్‌లో చెలరేగిన ప్రజా ఆందోళనల నేపథ్యంలో, షేక్ హసీనా సైనిక హెలికాప్టర్ ద్వారా ఢాకా చేరుకుని, అక్కడి నుంచి బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో భారతదేశంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు పారిపోయారు. ఆమె పారిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఆ వీడియోను రికార్డ్ చేసింది సూరీయే అనే ఆరోపణలు వచ్చాయి. అయితే, వేరొక అధికారి తీసిన ఆ వీడియోను సూరీ సోషల్ మీడియాలో షేర్ చేసినందుకే అతనిపై నిఘా పెట్టి, మానసిక క్షోభకు గురిచేసి ఇప్పుడు దారుణంగా హత్య చేశారని సూరీ బంధువులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు, 2024లోనే సూరీ ఎయిర్‌ఫోర్స్ విధుల నుంచి తప్పుకున్నాడని, సైనిక నిబంధనల ప్రకారమే అతను లాంఛనంగా రాజీనామా చేశాడని, అతనిపై ఎలాంటి ఆరోపణలు లేవని బంగ్లాదేశ్ మిలిటరీ మీడియా విభాగం (ISPR) స్పష్టం చేసింది. క్రికెట్ బోర్డు, పొగాకు కంపెనీ తదితర పలు సంస్థల్లో పనిచేసిన ఓ యువ మాజీ అధికారి, వివాదాస్పద వీడియో నేపథ్యంలో ఇలా అనుమానాస్పద స్థితిలో మరణించడం బంగ్లాదేశ్ రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.


Posted

in

by

Tags: