బట్టలు ఆరేయడానికి మేడపైకి వెళ్లిన మహిళకు ఊహించని ప్రమాదం.. భుజంపైకి ఎక్కి ముఖం, వీపుపై దాడి చేసిన కోతి.. కుప్పకూలిన 28 ఏళ్ల యువతి!

రాజస్థాన్‌లోని కోటాలో కోతి దాడి చేసిన ఘటన అనంతరం 28 ఏళ్ల మహిళ మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. బట్టలు ఆరేయడానికి ఇంటి మేడపైకి వెళ్లిన ఆమెపై అకస్మాత్తుగా కోతి దాడి చేయడంతో భయాందోళనకు గురై కుప్పకూలింది. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆమె మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

కోటాలోని కాన్సువా ప్రాంతం, జగావోన్ వీధికి చెందిన రేణు భట్‌కు ఆరేళ్ల కుమార్తె ఉంది. ఆదివారం మధ్యాహ్నం ఇంటి మేడపై బట్టలు ఆరేయడానికి రేణు వెళ్లింది. అదే సమయంలో అక్కడికి కోతుల గుంపు వచ్చింది.

ఆ గుంపులోని ఒక కోతి ఒక్కసారిగా రేణు భుజంపైకి ఎక్కి, ముఖం, వీపు భాగాలపై గోళ్లతో దాడి చేసినట్లు సమాచారం. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన రేణు, తనను తాను రక్షించుకునేందుకు ఒక కర్రను తీసుకుంది. అయినప్పటికీ కోతి దాడి కొనసాగించడంతో ఆమె భయంతో తట్టుకోలేక స్పృహ కోల్పోయి కిందపడిపోయింది.

రేణు కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే మేడపైకి పరుగెత్తుకొచ్చారు. అప్పటికే ఆమె కిందపడిపోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే కోతులను తరిమేసి, రేణును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

రేణుకు సైలెంట్ హార్ట్ అటాక్ రావడమే మరణానికి కారణమని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే కోతి దాడి వల్ల కలిగిన భయాందోళనకు, ఆమె మరణానికి మధ్య ఉన్న వైద్యపరమైన సంబంధంపై ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత రాలేదు. 28 ఏళ్ల వయసులోనే రేణు మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఇదిలా ఉండగా, ఆ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు గతంలోనే పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన మున్సిపల్ ఆరోగ్యశాఖ అధికారి.. ఫిర్యాదులు అందిన ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసి కోతులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది జనవరి నుంచి కోటా నగరంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో మొత్తం 1,562 కోతులను పట్టుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. ప్రస్తుతం మరోసారి కాన్సువా ప్రాంతంలో కూడా బోన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *