చెన్నై: తాంబరం బస్టాండ్లో షేర్ ఆటో కోసం వేచి చూస్తున్న ఒక యువతి పట్ల 50 ఏళ్ల వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఊహించని పరిణామంతో షాక్ తిన్న ఆ యువతి, ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆ వ్యక్తి చెంపలు వాయించింది. తప్పించుకోవడానికి ప్రయత్నించిన అతడిని అక్కడి జనం పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టపగలే జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగింది?
చెన్నైలోని ఆలందూరుకు చెందిన ఓ యువతి తన తల్లితో కలిసి ముడిచ్చూర్ వెళ్లేందుకు తాంబరం బస్టాండ్లో షేర్ ఆటో కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో సుమారు 50 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి ఆ యువతి దగ్గరకు వచ్చి, ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.
దీంతో ఆగ్రహించిన ఆ యువతి ఆ వ్యక్తి చెంపలు చెల్లుమనిపించింది. అంతటితో ఆగకుండా అతడి చొక్కా పట్టుకుని, “ఎక్కడికి తప్పించుకుందామని చూస్తున్నావు?” అంటూ నిలదీసింది. ఎందుకు అలా చేశావంటూ అతడితో వాగ్వాదానికి దిగింది. అక్కడున్న ప్రయాణికులు ఏం జరిగిందని అడగగా, యువతి జరిగిన విషయాన్ని వివరించింది.
మద్యం మత్తులో చేశానని క్షమాపణలు
అక్కడి నుండి తప్పించుకోవాలని చూసిన ఆ వ్యక్తిని ప్రయాణికులు పట్టుకుని మహిళా పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా, అతడు ఉలుందూర్ పేటకు చెందిన వ్యక్తి అని, తాంబరం సమీపంలో ఉంటూ వంట మనిషిగా పనిచేస్తున్నాడని తేలింది.
మద్యం మత్తులో తెలియక తప్పు చేశానని సదరు వ్యక్తి పోలీసుల ముందు ప్రాధేయపడ్డాడు. ఆ తర్వాత, “ఇకపై ఇలాంటి పనులు చేయను” అని చెప్పి సదరు యువతి కాళ్లపై పడి క్షమాపణలు చెప్పేలా పోలీసులు చేశారు. రద్దీగా ఉండే బస్టాండ్లో ఇలాంటి ఘటన జరగడం పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
