బస్సులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడి పట్ల మరాఠీ నటి అనుష్క పింపుట్కర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా కనిపించిన వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై పలువురు తీవ్ర విమర్శలు చేశారు. పురుషుల హక్కుల కార్యకర్త దీపికా భరద్వాజ్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ నటిపై విమర్శలు గుప్పించారు. అయితే, ఈ వివాదంపై తాజాగా స్పందించిన అనుష్క.. వీడియో వెనుక ఉన్న అసలు విషయాన్ని వెల్లడించారు.
తనను ఉద్దేశపూర్వకంగా తప్పుగా చూపించేందుకు సినిమా ప్రమోషన్ వీడియోను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఈ వివాదంపై ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చిన అనుష్క.. ‘జనక్’ అనే తన మరాఠీ సినిమా ప్రచారంలో భాగంగానే ఆ దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలిపారు. బస్సులో ఓ వృద్ధుడి పక్కన నిలబడి ఉన్నట్లు కనిపించే ఆ వీడియో చివర్లో సినిమా పేరు, విడుదల తేదీ స్పష్టంగా ఉన్నాయని చెప్పారు.
అయితే కొందరు కావాలనే వీడియోలోని చివరి భాగాన్ని తొలగించి, అసలు సందర్భాన్ని పక్కనపెట్టి కేవలం కొంత భాగాన్ని మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆమె వివరించారు. దీంతో సినిమా ప్రచారానికి సంబంధించిన దృశ్యాన్ని నిజంగా జరిగిన ఘటనగా భావించి పలువురు తనపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం వ్యూస్, ఫాలోవర్ల కోసం సోషల్ మీడియాలో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారని ఈ ఘటన ద్వారా అర్థమైందని అనుష్క అన్నారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా కొన్ని సోషల్ మీడియా పేజీలు, మీడియా సంస్థలు కూడా వార్తలను ప్రచారం చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
విచిత్రమేమిటంటే, తన ‘జనక్’ సినిమా కూడా సోషల్ మీడియా మోజు, దాని ప్రభావాల గురించే చర్చిస్తుందని ఆమె పేర్కొన్నారు.
వాస్తవాలు తెలుసుకోకుండా ఆ వీడియోను మరింతగా షేర్ చేయవద్దని నటి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే వైరల్ అయిన వీడియోను తొలగించాలని కోరారు. సినిమా ప్రమోషన్ కోసం చేసిన ప్రయత్నం తప్పుదారి పట్టించేలా ప్రచారం కావడంతో తీవ్ర మానసిక ఆవేదనకు గురైనట్లు తెలిపారు.

Leave a Reply