హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో భార్య విపరీతమైన అనుమానం, ఆంక్షలతో మానసిక వేదనకు గురైన 24 ఏళ్ల యువకుడు అర్మాన్ ఖాన్, ఓ వీడియో విడుదల చేసి అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది.
బీఫార్మసీ చదువుతూ జొమాటో (Zomato) డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న అర్మాన్‌కు తొమ్మిది నెలల క్రితం ఆలియా అనే యువతితో వివాహమైంది. పెళ్లయిన కొద్ది రోజులకే అర్మాన్‌పై భార్యకు తీవ్ర అనుమానం మొదలైందని, రోజూ అతని ఫోన్ కాల్స్ తనిఖీ చేయడం, బాత్రూంలో 5 నిమిషాలకు మించి ఉండకూడదని ఆంక్షలు విధించడం వంటివి చేస్తూ నిరంతరం నిఘా పెట్టేదని అర్మాన్ తండ్రి ఆరోపించారు.
అంతేకాకుండా, అర్మాన్ నిజంగానే పనికి వెళ్తున్నాడా లేక మరెవరినైనా కలవడానికి వెళ్తున్నాడా అని గమనించడానికి, రాత్రి వేళల్లో అతనితో పాటు బైక్‌పై ఆలియా కూడా డెలివరీకి వెళ్లేది. కుటుంబ కలహాల కారణంగా తల్లిదండ్రులకు దూరంగా వేరే ఇంట్లో ఉంటున్న అర్మాన్, అప్పుల బాధతో పాటు భార్య నిరంతర అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. అదృశ్యమయ్యే ముందు అతను విడుదల చేసిన వీడియోలో, “ఏం తింటున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను అని ప్రతి నిమిషం లెక్క చెప్పాల్సి వచ్చేది. భార్య అనుమానం వల్ల నా జీవితం ఈ స్థితికి చేరింది” అని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆగ్రా కాలువ వైపు వెళ్తున్నట్లు తెలిపాడు.
సోమవారం రాత్రి అర్మాన్ ఇంటికి తిరిగి రాకపోవడంతో, అతని భార్య 182 సార్లు ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అదృశ్యమైన అర్మాన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే, తన భర్త మరియు అత్తింటి వారు చేస్తున్న ఆరోపణలన్నింటినీ ఆలియా పూర్తిగా ఖండించింది.
తన భర్తకు రెండో పెళ్లి చేస్తామని అత్తింటి వారు బెదిరించారని, తనను కొట్టి వేధించారని ఆలియా ప్రతిఫిర్యాదు చేసింది. అదృశ్యమైన అర్మాన్ ఖాన్ ఆచూకీ లభించిన తర్వాతే ఈ కేసు వెనుక ఉన్న అసలు నిజం బయటపడుతుందని పోలీసులు తెలిపారు.

Leave a Reply