ఉత్తరప్రదేశ్: పీలిభిత్లోని గోకుల్ధామ్ కాలనీలో సోమవారం ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. మూసి ఉన్న బాత్రూమ్లో భార్యాభర్తలు శవాలై కనిపించిన వార్త అందరినీ కలిచివేసింది. వారి మరణానికి కారణం ఏ శత్రుత్వం లేదా దాడి కాదు.. వారి ఇంట్లో ఉన్న గ్యాస్ గీజర్ (Gas Geyser). ఈ గీజర్ వల్ల విడుదలైన విషవాయువు క్షణాల్లో రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.
ఐదేళ్ల క్రితమే వివాహం
హర్జిందర్ సింగ్ మరియు రేణు సక్సేనా ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి పిల్లలు లేరు. రేణు చెయ్యి విరగడంతో, సోమవారం ఆమె స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు సహాయం చేయడానికి భర్త హర్జిందర్ కూడా లోపలికి వెళ్లారు. హర్జిందర్ అప్పటికే డ్యూటీకి వెళ్లడానికి షూస్ వేసుకుని సిద్ధంగా ఉన్నారు. కానీ విధి మరోలా తలచింది. గ్యాస్ గీజర్ నుండి వెలువడిన విషవాయువు కేవలం కొన్ని నిమిషాల్లోనే వారి ఊపిరి తీసేసింది.
ఇరుగుపొరుగు వారి అనుమానం
రాత్రి సమయంలో మిద్దెపై ఆరవేసిన బట్టలు అలాగే ఉండటంతో పొరుగువారికి అనుమానం వచ్చి ఫోన్ చేశారు. ఎన్నిసార్లు చేసినా సమాధానం రాకపోవడంతో ఇంటికి వెళ్లి చూడగా లోపల నుండి గడియ పెట్టి ఉంది. పోలీసుల సమక్షంలో తలుపులు పగలగొట్టి చూడగా, హర్జిందర్ మరియు రేణు స్పృహ లేకుండా పడి ఉన్నారు. ప్రాథమిక విచారణలో గ్యాస్ లీకేజీయే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
గ్యాస్ గీజర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
గ్యాస్ గీజర్ పనిచేస్తున్నప్పుడు కార్బన్ మోనాక్సైడ్ (Carbon Monoxide) అనే అత్యంత ప్రమాదకరమైన వాయువును విడుదల చేస్తుంది. దీనికి రంగు ఉండదు, వాసన కూడా ఉండదు. కానీ ఇది ఊపిరితిత్తుల్లోని ఆక్సిజన్‌ను వేగంగా హరించివేస్తుంది.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి:
- గీజర్ ఆఫ్ చేయండి: స్నానం చేయడానికి బాత్రూమ్లోకి వెళ్లే ముందే గీజర్‌ను ఆపివేయాలి. నీళ్లు వేడెక్కాక గీజర్ ఆఫ్ చేసి, ఆ తర్వాతే స్నానం ప్రారంభించండి.
- గాలి వెలుతురు (Ventilation): బాత్రూమ్లో తప్పనిసరిగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా కిటికీ ఉండాలి. మూసి ఉన్న గదిలో గ్యాస్ గీజర్ వాడటం ప్రాణాపాయం.
- బయట అమర్చండి: వీలైతే గ్యాస్ గీజర్‌ను బాత్రూమ్ లోపల కాకుండా బయట అమర్చి, పైపుల ద్వారా లోపలికి నీరు వచ్చేలా చూసుకోండి.
