మహారాష్ట్రలోని ఠాణే జిల్లా కల్యాణ్ ప్రాంతంలో, ప్రియుడిని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని బస్తా లో కుక్కి పడేసిన దిగ్భ్రాంతికర సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ హత్య ఉదంతానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఒక మహిళ, తన ఇంటి యజమానికి ఒక వాయిస్ మెసేజ్ పంపి కోల్‌కతాకు పరారైంది.
ఆ వాయిస్ మెసేజ్‌లో “బాత్రూమ్ నల్లా (టాప్) తెరిచి ఉంది, లోపల ఒక శవం ఉంది” అని ఆమె చెప్పిన షాకింగ్ సమాచారం సదరు ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ప్రేమికుల మధ్య జరిగిన గొడవల కారణంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నారు.
హత్యను దాచడం కోసం, ప్రియుడి మృతదేహాన్ని ఒక బస్తాలో కుక్కి ఉంచిన ఆ మహిళ.. ఇంటికి తాళం వేసి పారిపోయింది. బాత్రూమ్లో నీరు వృథా కాకుండా చూడాలని, అలాగే లోపల శవం ఉన్న విషయాన్ని ఇంటి యజమాని వెంటనే తెలుసుకోవాలని ఆమె పంపిన ఆ సమాచారం ఆధారంగా.. యజమాని ఇంటికి వెళ్లి చూడటంతోనే ఈ కిరాతక ఘటన బయటపడింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కల్యాణ్ పోలీసులు, కోల్‌కతాకు పారిపోయిన ఆ మహిళను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని (టాస్క్ ఫోర్స్) ఏర్పాటు చేసి ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. అలాగే, హత్యకు గురైన వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు.
