ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సమీపంలోని ఒక గ్రామంలోకి అకస్మాత్తుగా ప్రవేశించిన భారీ కొండచిలువ స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
పొలాల నుంచి జనావాసాల్లోకి పాకుతూ వచ్చిన ఆ భారీ కొండచిలువను చూసి స్థానికులు కొద్దిసేపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణికిపోయారు.
మీరట్ పరిధిలోని హసన్పూర్ ఖాదిమ్ గ్రామంలో వ్యవసాయ భూముల నుంచి బయటకు వచ్చిన ఒక భారీ కొండచిలువ నిన్న అకస్మాత్తుగా ఊరి మధ్యలోకి ప్రవేశించింది. ప్రజలు తిరిగే ప్రధాన రహదారిపై అది దర్జాగా పాకుతూ వెళ్లడం చూసి జనం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏకంగా అనకొండ సైజులో కనిపిస్తున్న ఆ కొండచిలువను చూసి తీవ్ర భయాందోళనలు చెలరేగాయి.
ఆ కొండచిలువ నేరుగా రోడ్డు పక్కనే ఉన్న ఒక ఇంటి ప్రధాన ద్వారం వైపు వెళ్లడం ప్రారంభించింది. అది ఇంట్లోకి దూరితే పెను ప్రమాదం జరుగుతుందని గ్రహించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ.. ఆ కొండచిలువ తోకను పట్టుకుని ఇంట్లోకి వెళ్లకుండా వెనక్కి లాగడానికి ప్రయత్నించిన దృశ్యం అక్కడున్న వారిని మరింత టెన్షన్‌కు గురిచేసింది.
ఈ విషయం ఊరంతా తెలియడంతో క్షణాల్లో భారీగా జనం అక్కడికి చేరుకున్నారు. అంత పెద్ద కొండచిలువను చూసి చాలామంది భయంతో దూరంగా పరుగులు తీయగా, కొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు రికార్డ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికులంతా ఏకమై కొండచిలువ ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటూనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ రెస్క్యూ సిబ్బంది, గ్రామస్తుల సహాయంతో తీవ్రంగా శ్రమించి ఆ భారీ కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా తరలించి, హస్తినాపూర్ వన్యప్రాణుల అభయారణ్యంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
అటవీశాఖ అధికారులు వేగంగా స్పందించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి భారీ కొండచిలువలు, విషసర్పాలు కనిపించినప్పుడు స్వయంగా పట్టుకోవడానికి సాహసాలు చేయకుండా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
