మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ జిల్లా పీతావళి గ్రామంలోని ఓ ఇంట్లో అనూహ్య ఘటన వెలుగుచూసింది.
షోయబ్ పటేల్ అనే వ్యక్తి ఇంట్లోని ఇండియన్ స్టైల్ టాయిలెట్ కమోడ్ లోపల దాదాపు 7 అడుగుల పొడవున్న భారీ పాము నక్కి ఉంది. దీన్ని చూసిన కుటుంబ సభ్యులు భయంతో ఒక్కసారిగా కేకలు వేశారు. ఈ విషయం గ్రామం మొత్తం తెలియడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. బాత్రూమ్ టాయిలెట్ సీటు లోపల అంత పెద్ద పాము కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
దీంతో గ్రామస్థులు వెంటనే దేవాస్‌కు చెందిన స్నేక్ క్యాచర్ (పాములు పట్టే నిపుణుడు) షాహిద్‌కు సమాచారం అందించారు. ఆయన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పామును పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. టాయిలెట్ సీటు లోపల ఇరుక్కుపోయిన పామును బయటకు తీయడం ఎంతో కష్టతరంగా మారింది. దాదాపు 4 గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత పామును క్షేమంగా బయటకు తీశారు. అనంతరం దానిని ఒక పెట్టెలో భద్రపరిచి, గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ దృశ్యాలలో టాయిలెట్ కమోడ్ లోపల భారీ పాము చుట్టుకుని పడుకుని ఉండటం కనిపిస్తుంది. ఆ తర్వాత స్నేక్ క్యాచర్ ఎంతో అప్రమత్తంగా దాన్ని బయటకు లాగడం రికార్డైంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. బాత్రూమ్ను ఉపయోగించే ముందు ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిదని కామెంట్లు పెడుతున్నారు.
వర్షాకాలంలో, అలాగే తీవ్రమైన ఎండల సమయంలో పాములు డ్రైనేజీ పైపులు, మురుగు కాలువలు, చీకటిగా ఉండే మార్గాల ద్వారా ఇళ్లలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాష్‌రూమ్‌లు, చెట్ల పొదలు, చీకటి ప్రాంతాల వద్ద ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇంట్లోకి పాము వస్తే సొంతంగా పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించకుండా, వెంటనే అనుభవజ్ఞులైన స్నేక్ క్యాచర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.
