కొన్నిసార్లు అదృష్టం ఏ రూపంలోనైనా వస్తుంది. ఆయుష్షు గట్టిగా ఉంటే ప్రాణం కాపాడటానికి ఒక గడ్డిపోచ చాలని సామెత ఉంది. కానీ ఉడుపికి చెందిన ఒక వృద్ధుడికి మాత్రం గడ్డిపోచ కాదు, గ్యాస్ సిలిండర్ OTP ప్రాణం పోసింది!
మూడు రోజుల పాటు బావిలో పడి మృత్యువుతో పోరాడిన 62 ఏళ్ల శ్రీనివాస ఆచార్య అనే వ్యక్తి, ఒక ఓటిపి వల్ల ప్రాణాలతో బయటపడటం నిజంగా ఒక అద్భుతం. ఉడుపిలోని కంబళకట్టెలో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగింది?
శ్రీనివాస ఆచార్య ఒంటరిగా నివసించేవారు. మూడు రోజుల క్రితం నీళ్ల కోసం బావి వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు తాడు తెగి 20 అడుగుల లోతున్న బావిలో పడిపోయారు. బావిలో నీరు ఉండటంతో పైకి రావడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆయన కేకలు కూడా ఎవరికీ వినిపించలేదు. ఒకానొక దశలో ప్రాణాలపై ఆశ వదిలేసుకున్నారు. ఆయన ఒంటరిగా ఉండటంతో, ఆయన ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు. బావిలోని ఫుట్-వాల్వ్ పైపును పట్టుకుని మూడు రోజుల పాటు నీళ్లలోనే గడిపారు.
ప్రాణం కాపాడిన గ్యాస్ OTP
ఇక్కడే కథలో అసలైన మలుపు ఉంది. శ్రీనివాస్ గ్యాస్ సిలిండర్ బుక్ చేశారు, కానీ సరఫరాలో ఆలస్యం కావడంతో తన స్నేహితుడు గణేష్ దగ్గర ఉన్న అదనపు సిలిండర్‌ను తీసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత గణేష్‌కు గ్యాస్ అవసరం పడటంతో, ఏజెన్సీకి ఫోన్ చేసి శ్రీనివాస్ ఇంటికి వెంటనే సిలిండర్ పంపమని కోరారు. గ్యాస్ సిబ్బంది సిలిండర్ తీసుకుని శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు, కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో వెనుతిరిగారు.
అనుమానంతో బావిలోకి చూడగా..
ఈ విషయం గణేష్‌కు తెలియదు. మళ్లీ గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేయగా.. “రెండు రోజుల క్రితమే వెళ్లాము, కానీ ఓటిపి ఇవ్వడానికి ఇంట్లో ఎవరూ లేరు” అని సిబ్బంది చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన గణేష్ వెంటనే శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. కనీసం ఓటిపి కోసమైనా ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవాలని గాలిస్తూ చివరకు బావిలోకి తొంగి చూడటంతో అసలు విషయం బయటపడింది.
అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశం
వెంటనే స్థానికులు బావిలోకి నిచ్చెన వేసి ఆయనను పైకి తీయడానికి ప్రయత్నించారు. కానీ, మూడు రోజుల నుండి ఆహారం లేక నీరసించిపోయిన శ్రీనివాస్ తాడును పట్టుకునే స్థితిలో కూడా లేరు. వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. వారు బావిలోకి దిగి శ్రీనివాస ఆచార్యను సురక్షితంగా పైకి తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు.
