“బిడ్డను కన్నందుకు 100 కొరడా దెబ్బలా?” సౌదీలో చిక్కుకుని అల్లాడుతున్న 40 ఏళ్ల కెన్యా మహిళ.. ఏడాది చిన్నారితో స్వదేశానికి తిరిగి వెళ్లలేక నరకయాతన..!

కెన్యాకు చెందిన 40 ఏళ్ల మహిళకు సౌదీ అరేబియాలో వివాహేతర సంబంధం ద్వారా బిడ్డకు జన్మనిచ్చారన్న ఆరోపణలపై కోర్టు 100 కొరడా దెబ్బల శిక్ష విధించింది.

ఎస్తేర్ వాంజా ముథోని అనే ఆ మహిళ, సౌదీలోని ఒక కుటుంబం ఇంట్లో ఇంటి పనిమనిషిగా, పిల్లల సంరక్షకురాలిగా పనిచేసేవారు. ఆ సమయంలో ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక వ్యక్తితో ఏర్పడిన పరిచయం కారణంగా ఆమె గర్భం దాల్చినట్లు సమాచారం. అయితే, బిడ్డ పుట్టకముందే ఆ వ్యక్తి సౌదీ విడిచి వెళ్లిపోయాడు. పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన విషయం బయటపడటంతో ముథోని తీవ్రమైన చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు.

ముథోని అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడే ఆమె గర్భవతి అన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బిడ్డ పుట్టగానే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. సౌదీ అరేబియాలో వివాహానికి ముందు శారీరక సంబంధం పెట్టుకోవడం చట్టవిరుద్ధం కావడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఆమెకు 100 కొరడా దెబ్బల శిక్ష విధించింది. గత నెలలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ఈ శిక్షను తాను తట్టుకోలేనని, తలచుకుంటేనే చాలా భయమేస్తోందని ముథోని కన్నీటిపర్యంతమయ్యారు.

ఇదిలా ఉండగా, తన ఏడాది కుమారుడు అబుధితో కలిసి కెన్యాకు తిరిగి వెళ్లేందుకు ఆమె ఏడాదికి పైగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ, చట్టపరమైన కేసుల కారణంగా స్వదేశానికి వెళ్లడంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రసవం తర్వాత, ఆమె పనిచేసే చోట ఉన్న కార్మికుల నివాసంలోకి తిరిగి అనుమతించకపోవడంతో కొంతకాలం ఒక పెట్రోల్ బంక్ వద్దే తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అక్కడ ఆమె లాగే బిడ్డలతో స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఎదురుచూస్తున్న మరికొందరు మహిళలు కూడా ఆశ్రయం పొందుతున్నట్లు తెలిసింది. ఈ విషయం మీడియాలో ప్రసారమైన తర్వాత ఆమెకు ఉండటానికి వసతి ఏర్పాటు చేసినప్పటికీ, కేసు పెండింగ్‌లో ఉన్నందున దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు సౌదీ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన ‘ALQST’ సంస్థ తాత్కాలిక డైరెక్టర్ మరియం అల్-దోసారీ మాట్లాడుతూ.. 100 కొరడా దెబ్బల శిక్ష అనేది ఒక రకమైన హింస అని, ముథోనిని, ఆమె బిడ్డను తక్షణమే కెన్యాకు వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. తనకు సరైన న్యాయ సహాయం కూడా అందలేదని, కేవలం ఒక అనువాదకుడిని మాత్రమే ఇచ్చారని ముథోని ఆవేదన వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధాల చట్టాలు ప్రధానంగా మహిళలనే తీవ్రంగా బాధిస్తున్నాయని మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం తన చిన్నారితో సురక్షితంగా స్వదేశానికి చేరుకునేందుకు ఆమె పోరాటం కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *