“బిస్లెరీ మాత్రమే కాదు.. ఇకపై అన్ని వాటర్ బాటిళ్లకు తనిఖీలు!”.. తాగునీటి బాటిళ్లలో ప్రమాదకర రసాయనాలా?.. కంపెనీలకు FSSAI కఠిన హెచ్చరిక..!

బిస్లెరీ తాగునీటి నాణ్యతపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న నేపథ్యంలో, భారత్‌లో విక్రయించే అన్ని ప్యాకేజ్డ్ తాగునీటి బ్రాండ్లపై కఠిన నిఘా పెట్టాలని భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) నిర్ణయించింది.

ఇందుకోసం వివిధ కంపెనీలకు చెందిన తాగునీటి బాటిళ్ల నుంచి యాదృచ్ఛికంగా (ర్యాండమ్‌గా) నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపింది. ఈ పరీక్షల ఫలితాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. నాణ్యత లేని తాగునీటి విక్రయాలను అరికట్టడంతో పాటు ప్రజల ఆరోగ్య భద్రతను నిర్ధారించేందుకు ఈ చర్యలు చేపట్టింది.

ఈ వివాదానికి కారణమైన బిస్లెరీ విషయానికొస్తే, గోవాలోని ఆ సంస్థ ప్లాంట్‌లో 2025 సెప్టెంబర్‌లో సేకరించిన ఒక నీటి నమూనాలో పరిమితికి మించి ‘బ్రోమేట్’ ఉన్నట్లు FSSAI తెలిపింది. ప్రాథమిక పరీక్షల్లో ఆరు నమూనాలలో ఐదు సురక్షితంగా ఉన్నాయని, ఒక్క నమూనాలో మాత్రమే లీటరుకు 12 మైక్రోగ్రాముల బ్రోమేట్ నమోదైందని బిస్లెరీ వివరణ ఇచ్చింది. అనుమతించదగిన పరిమితి 10 మైక్రోగ్రాములు కావడంతో ఆ సంస్థ అప్పీల్ చేసింది. తదుపరి పరీక్షల్లో బ్రోమేట్ స్థాయి పరిమితిలోనే ఉన్నప్పటికీ, PAHs అనే రసాయనాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారని కంపెనీ తెలిపింది. అయితే, ఈ ఆరోపణలను బిస్లెరీ ఖండించింది.

అంతేకాకుండా, తమ తయారీ ప్రక్రియలో 10 దశల్లో 90కి పైగా నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్షా ఫలితాలను అధికారులకు సమర్పించిన తర్వాత ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ వివాదం ముగిసిపోయిందని తాము భావించామని బిస్లెరీ పేర్కొంది. ఇదిలా ఉండగా, ఇతర ప్రముఖ తాగునీటి కంపెనీల ఉత్పత్తులను కూడా FSSAI తనిఖీ చేయడం ప్రారంభించింది. ప్రముఖ బ్రాండ్ల పేర్లు, లేబుళ్లను నకిలీ చేసి విక్రయించే వాటర్ బాటిళ్లపై కూడా నిఘా ఉంచారు. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా నకిలీ పేర్లు లేదా లేబుళ్లు ఉపయోగించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *