మధ్యప్రదేశ్లోని పన్నాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తీవ్ర కలకలం రేపిన ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
పన్నా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ జాతీయ జెండాను ఎగురవేస్తున్న సమయంలో.. ఆ త్రివర్ణ పతాకం ఒక్కసారిగా జారి నేలపై పడిపోవడం అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఎమ్మెల్యే జెండా ఎగురవేసేందుకు తాడు లాగగానే, పతాకం సరిగ్గా విచ్చుకోకుండా ఉన్నట్టుండి కింద పడిపోయింది. దీంతో అక్కడున్న వారు హుటాహుటిన పరుగున వచ్చి జెండాను గౌరవంగా పైకి తీశారు. ఈ తాలూకు దృశ్యాలు అక్కడున్న వారి మొబైల్ కెమెరాల్లో రికార్డై, ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ తీవ్ర దుమారానికి దారితీశాయి.
స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ పర్వదినాన జాతీయ జెండా నేలపాలు కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జెండా ఆవిష్కరణకు ముందే తాడు, పోల్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
