మోతీహరి: బీహార్‌లోని మోతీహరి నుండి ఒక దిగ్భ్రాంతికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. బీహార్‌కు వస్తున్న ఒక స్విట్జర్లాండ్ మహిళను, అలాగే మయన్మార్‌కు చెందిన ఒక యువకుడిని సరిహద్దు రక్షణ దళాలు పట్టుకున్నాయి. వీరిద్దరూ నేపాల్ సరిహద్దు మార్గం ద్వారా భారతదేశంలోకి అక్రమంగా చొరబడటానికి ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డారు. విచారణలో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడికావడంతో శశస్త్ర సీమా బల్ (SSB) బృందం వారిని వెంటనే అరెస్ట్ చేసింది.
రహస్య సమాచారంతో నిఘా
వివరాల ప్రకారం.. తూర్పు చంపారన్ జిల్లాలోని రక్సాల్ పరిధిలో గల కస్టమ్స్ చౌక్ సమీపంలో కొంతమంది విదేశీయులు నేపాల్ మీదుగా అక్రమంగా భారత సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎస్ఎస్బీకి రహస్య సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా భద్రతా దళాలు ఆ ప్రాంతంలో నిఘా పెంచి, అనుమానితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ తనిఖీల్లో స్విట్జర్లాండ్‌కు చెందిన జూనిలా బెక్ శ్రేష్ఠ, మయన్మార్‌కు చెందిన ఆంగ్ నింగ్ లింగ్ లాట్‌లను అదుపులోకి తీసుకున్నారు.
చెల్లుబాటు అయ్యే పత్రాలు లేవు
వారిని శోధించి, విచారించిన సమయంలో భారతదేశంలోకి ప్రవేశించడానికి లేదా ఇక్కడ నివసించడానికి సంబంధించిన ఎలాంటి చెల్లుబాటు అయ్యే పత్రాలు (పాస్‌పోర్ట్, వీసా వంటివి) లభించలేదు. దీంతో ఎస్ఎస్బీ అధికారులు వీరిద్దరినీ స్థానిక పోలీసులకు అప్పగించారు.
ప్రస్తుతం ఆ ఇద్దరు విదేశీయులను తీవ్రంగా విచారిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. వారు నేపాల్ మార్గం ద్వారా భారతదేశంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నారు? వారి భారత్ పర్యటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ఇక్కడ వారు ఎవరిని సంప్రదించడానికి ప్రయత్నించారు? వారి చివరి గమ్యస్థానం ఏది? అనే కోణాల్లో దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి.
రంగంలోకి దర్యాప్తు సంస్థలు
భారత్-నేపాల్ సరిహద్దులు తెరిచి ఉండటం వల్ల చాలా సార్లు విదేశీయులు అక్రమ మార్గాల్లో సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందువల్ల ఈ కేసు భద్రతా సంస్థలకు అత్యంత సున్నితమైనదిగా మారింది. ఎటువంటి చట్టపరమైన పత్రాలు లేకుండా విదేశీ పౌరులు దేశంలోకి ప్రవేశించడం భద్రతా పరంగా తీవ్ర ఆందోళన కలిగించే విషయమని, అందుకే అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశామని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి.

Leave a Reply