ఒకప్పుడు ఏ చేతులతోనైతే భక్తిశ్రద్ధలతో ఆ ప్రార్థనా మందిరాన్ని నిర్మించారో, ఈరోజు అదే చేతులతో దాని గోడలను, కిటికీలను తొలగించాల్సిన బాధాకరమైన పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది?
అలాంటి గుండె బరువెక్కే భావోద్వేగ ఘటనే మధ్యప్రదేశ్‌లోని చారిత్రాత్మక ఉజ్జయిని నగరంలో చోటుచేసుకుంది. ఉజ్జయిని నగరంలోని ప్రసిద్ధ ‘షాహీ మసీదు’లోని కొంత భాగాన్ని రోడ్డు విస్తరణ పనుల కోసం తొలగిస్తుండటంతో, ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత, భావోద్వేగ వాతావరణం నెలకొంది.
రోడ్డు విస్తరణ పరిధిలోకి వచ్చే మసీదు భాగాన్ని అధికారులు బుల్డోజర్లతో కూల్చివేసేలోపే, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ప్రజలే స్వయంగా ముందుకు వచ్చి ఆ గోడలను, కిటికీ ఊచలను విప్పి తొలగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి పెను సంచలనం సృష్టించాయి.
ఆ వీడియోలలో చాలా మంది ప్రజలు “యా అల్లాహ్” అంటూ గట్టిగా ప్రార్థించడం, మసీదును కాపాడాలని విలపించడం వినిపిస్తోంది. వీడియోలో ఒక వ్యక్తి మాట్లాడుతూ.. “ఏ చేతులతోనైతే ఈ మసీదును మేము ఎంతో ఇష్టంగా నిర్మించుకున్నామో, ఈరోజు అదే చేతులతో దీన్ని పగలగొట్టాల్సిన పరిస్థితి వచ్చిందే..” అని కన్నీళ్లతో ఆవేదన వ్యక్తం చేయడం చూపరులను కదిలిస్తోంది.
2028వ సంవత్సరంలో ఉజ్జయినిలో జరగనున్న ప్రసిద్ధ ‘సింహస్థ కుంభమేళా’ వేడుకల కోసం రోడ్లను 15 మీటర్ల మేర వెడల్పు చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ విస్తరణ పరిధిలోకి షాహీ మసీదు ప్రార్థనా మందిరం, గోపురం (మినార్) మరియు ముందు భాగంలోని కొన్ని ప్రాంతాలు వస్తున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను మధ్యప్రదేశ్ హైకోర్టు గత సెప్టెంబర్ నెలలో కొట్టివేసింది.
దీంతో మసీదును కాపాడుకోవడానికి రాత్రికి రాత్రే ప్రజలు భారీగా గుమిగూడటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఒకానొక దశలో అక్కడ చేరిన కొందరు రాళ్ల దాడికి పాల్పడటంతో, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించి, లాఠీఛార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. ఈ ఘటనలో కొందరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉజ్జయిని ఎస్పీ ప్రదీప్ శర్మ నేతృత్వంలో ఆ ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా వలయంలోకి తీసుకువచ్చారు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసిన ఐదుగురిని, నగరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన మరో ఐదుగురు బయటి వ్యక్తులను.. మొత్తం 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా రాళ్ల దాడికి పాల్పడిన వారిని గుర్తించే పని ముమ్మరంగా సాగుతోంది.
దీనిపై ఉజ్జయిని కలెక్టర్ రోషన్ కుమార్ మాట్లాడుతూ.. “కుంభమేళా ముందస్తు ఏర్పాట్లలో భాగంగానే రోడ్లను వెడల్పు చేస్తున్నాం. ఛత్రీ చౌక్ (క్షత్రియ చౌక్) ప్రాంతంలోని ఈ ప్రార్థనా మందిర భాగాన్ని ఆ ప్రజలే స్వయంగా ముందుకు వచ్చి వేరే చోటుకు మార్చుకుంటున్నారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దు” అని విజ్ఞప్తి చేశారు.
ఒకవైపు నగర అభివృద్ధి పనులు, మరోవైపు ప్రజల భావోద్వేగాలతో ఉజ్జయిని నగరంలో ప్రస్తుతం ఒక రకమైన నివురుగప్పిన ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Leave a Reply