బెంగళూరు: కర్ణాటకలో వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే సీఈటీ (CET) పరీక్షా కేంద్రంలో ఐదుగురు బ్రాహ్మణ విద్యార్థుల జంద్యాలను (యజ్ఞోపవీతాలను) బలవంతంగా తొలగించినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. బెంగళూరులోని మడివాళ ప్రాంతంలో గల కృపానిధి కళాశాల కేంద్రంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
పరీక్ష రాయాలంటే జంద్యాలను తొలగించాల్సిందేనని ఇన్విజిలేటర్లు ఆదేశించారని విద్యార్థులు ఆరోపించారు. ఒక విద్యార్థి తన ఆవేదనను వ్యక్తపరుస్తూ.. “నేను ఉదయం 9.40 గంటలకు సెంటర్కు వెళ్లాను. నా జంద్యం చూసిన సిబ్బంది నన్ను లోపలికి అనుమతించలేదు. దానిని తీసివేస్తేనే పరీక్ష రాయనిస్తామని చెప్పారు. మరో ఏడుగురు విద్యార్థులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. వేరే దారి లేక జంద్యం తీసేశాను. దీనివల్ల నేను చాలా బాధపడ్డాను, పరీక్ష సరిగ్గా రాయలేకపోయాను” అని తెలిపాడు.
కేవలం జంద్యాలే కాకుండా, కొందరు విద్యార్థుల మణికట్టుకు ఉన్న ఎరుపు, పసుపు రంగు పవిత్ర దారాలను (మౌళి లేదా కాల్వ) కూడా తొలగించారని ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది కూడా శివమొగ్గ, బీదర్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగడంతో.. విద్యార్థుల జంద్యాలను తొలగించమని అడగకూడదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఈ ఏడాది మళ్ళీ ఇలా జరగడం గమనార్హం.
మంత్రి స్పందన: కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎం.సి. సుధాకర్ ఈ ఘటనను “అత్యంత దురదృష్టకరం” అని అభివర్ణించారు. “మేము ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాము. సదరు విద్యా సంస్థపై ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించాను” అని ఆయన తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురిని కాల్యాశం సస్పెండ్ చేసిందని, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుండి ఇలాంటివి పునరావృతం కాకుండా పరీక్షా కేంద్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలు అందజేస్తామన్నారు.
ప్రతిపక్షాల విమర్శలు: ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు ఆర్. అశోక్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీనిని “హిందూ వ్యతిరేక” చర్యగా ఆయన పేర్కొన్నారు. హాల్ టికెట్లో కానీ, అధికారిక నిబంధనల్లో కానీ జంద్యం వేసుకోకూడదని ఎక్కడా లేదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల విశ్వాసాలపై దాడి చేస్తోందని, ఇది అప్రకటిత “షరియా చట్టం” అమలు చేయడమేనని ఆయన ఆరోపించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పరీక్షల నిర్వహణ బాధ్యతలో ఉన్న ముగ్గురు సిబ్బందిని విచారిస్తున్నారు.
