బెంగాల్‌లో దొరికిన నేటి ‘మీర్ జాఫర్’! పాకిస్థానీ మహిళతో వివాహం, డబ్బు ఆశ.. గూఢచారిగా మారిన జఫర్ రియాజ్ కథ ఇదే!

కోల్‌కతా: బెంగాల్ చరిత్రలో మీర్ జాఫర్ అలీ ఖాన్ పేరును ప్రజలు మర్చిపోలేరు. మీర్ జాఫర్ ద్రోహం వల్లనే నవాబ్ సిరాజుద్దౌలా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు అదే బెంగాల్ గడ్డపై జఫర్ రియాజ్ అలియాస్ రిజ్వీ అనే మరో ‘మీర్ జాఫర్’ పుట్టుకొచ్చాడు. దేశద్రోహానికి పాల్పడుతూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కి చిక్కాడు.

ఏం జరిగింది?
జఫర్ రియాజ్ పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు (PIOs) మన దేశ భద్రతకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చేరవేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘X’లో ఎన్ఐఏ అధికారికంగా ధృవీకరించింది. జఫర్ రియాజ్ ఉగ్రవాద కుట్రలో భాగంగా, పాక్ గూఢచారులకు సమాచారం అందిస్తున్నాడని ఏజెన్సీ పేర్కొంది.

నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS), అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ మరియు యూఏపీఏ (UAPA) చట్టం కింద కేసులు నమోదు చేశారు. అతనిపై ఇప్పటికే ‘లుక్ అవుట్ సర్క్యులర్’ జారీ చేయగా, అతడిని ‘ప్రకటిత నేరస్తుడిగా’ (Proclaimed Offender) ప్రకటించే ప్రక్రియను కూడా అధికారులు వేగవంతం చేశారు.

పాకిస్థానీ మహిళతో వివాహం.. గూఢచారిగా మార్పు
దర్యాప్తులో జఫర్ రియాజ్ ఒక పాకిస్థానీ మహిళను వివాహం చేసుకున్నట్లు తేలింది. వారికి ఉన్న పిల్లలకు కూడా పాకిస్థాన్ పౌరసత్వం ఉంది. 2005 నుండి జఫర్ తరచుగా భారత్-పాకిస్థాన్ మధ్య ప్రయాణాలు చేస్తున్నాడు. ఒకానొక ప్రయాణంలో పాక్ గూఢచారులు అతనికి డబ్బు ఎర చూపి, పాకిస్థాన్ పౌరసత్వం ఇస్తామని ఆశపెట్టి గూఢచారిగా మార్చారు.

ఎన్ఐఏ కళ్లలో ఎలా పడ్డాడు?
ఎన్ఐఏ కథనం ప్రకారం, భారతీయ మొబైల్ నంబర్లకు వచ్చే వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)లను జఫర్ సదరు పాక్ అధికారులకు షేర్ చేసేవాడు. ఆ ఓటీపీలతో వాట్సాప్ అకౌంట్లను యాక్టివేట్ చేసుకుని, భారత్‌లోని మోతీరామ్ జాట్ అనే మరో నిందితుడితో రహస్యంగా సంభాషణలు జరిపేవారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న మరిన్ని కుట్రలను ఛేదించడానికి ఎన్ఐఏ ప్రస్తుతం దేశవ్యాప్తంగా (బెంగాల్, ఢిల్లీ, యూపీ, రాజస్థాన్) విస్తృత దాడులు నిర్వహిస్తోంది.


Posted

in

by

Tags: