బెంగాల్‌లో బీజేపీ 100కు పైగా సీట్లను లూటీ చేసింది; సీఆర్‌పీఎఫ్ నన్ను నెట్టివేసింది – మమతా బెనర్జీ ఆగ్రహం

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరించేందుకు మమతా బెనర్జీ నిరాకరించారు. ఎన్నికల సంఘం రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడిందని ఆమె ఆరోపించారు. ఈవీఎం మెషీన్ల నుండి ప్రతి అంశాన్ని లూటీ చేశారని మమత మండిపడ్డారు. “ఇది కేవలం లూటీ, లూటీ, లూటీ.. మేము మళ్ళీ బలంగా పుంజుకుంటాం. ఎన్నికల సంఘం కావాలనే బీజేపీకి ప్రయోజనం చేకూర్చింది” అని ఆమె అన్నారు.

కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చిన మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. తన ఏజెంట్‌ను బలవంతంగా బయటకు పంపించారని తెలియడంతో ఆమె స్వయంగా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఆమె అక్కడకు చేరుకున్న సమయంలో బీజేపీ మద్దతుదారులు “జై శ్రీరామ్” నినాదాలు చేశారు.

దీనిపై స్పందిస్తూ, “బీజేపీ విజయం అనైతికమైనది. వారు 100 కంటే ఎక్కువ సీట్లను అక్రమంగా దక్కించుకున్నారు. ఎన్నికల సంఘం కాస్తా బీజేపీ సంఘంగా మారిపోయింది. సీఈవో (CEO), మనోజ్ అగర్వాల్‌లకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదు. ఇది నైతిక విజయం కాదు. ఎన్నికల సంఘం, కేంద్ర బలగాలు, ప్రధానమంత్రి మరియు హోం మంత్రి కలిసి చేసిన పని ఇది” అని మమత ఆరోపించారు.

సీఆర్‌పీఎఫ్ దళాలపై ఆరోపణ:
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తనను కూడా కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని మమత వాపోయారు. “నన్ను లోపలికి వెళ్లనివ్వలేదు. నా దగ్గర ఐడీ కార్డు ఉన్నా అడ్డుకున్నారు. నా కళ్ల ముందే సీఆర్‌పీఎఫ్ నన్ను నెట్టివేసింది. వారు ప్రతిచోటా గూండాలను పెట్టారు. ఈవీఎంల లూటీతోనే ఇదంతా సాధ్యమైంది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


Posted

in

by

Tags: