పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ అంచనాలను వెలువరించాయి. మెజారిటీ సంస్థలు బెంగాల్‌లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంచనా వేస్తున్నాయి.
ఈ ఎగ్జిట్ పోల్స్ మధ్య, పాత్రికేయులు సౌరవ్ గంగూలీని కలిసి బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ఆయన అంచనా ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్న వినగానే నవ్వుతూ గంగూలీ ఇలా స్పందించారు – “బెంగాల్‌లో ఫలితం ఎలా ఉండబోతోందో సాక్షాత్తూ ఆ దుర్గామాత కూడా అంచనా వేయలేదు. సోమవారం ఈవీఎంలు తెరిచినప్పుడే ప్రజలకు అసలు విషయం తెలుస్తుంది. ఇప్పుడే నేను ఎలా సమాధానం చెప్పగలను?”
ప్రధాని మోదీ అయినా, సీఎం మమత అయినా లేదా మరెవరైనా సరే.. ఓట్ల లెక్కింపు పూర్తికాకుండా ఫలితాన్ని ఖచ్చితంగా చెప్పలేరని ఆయన పేర్కొన్నారు. కోల్‌కతాకు చెందిన గంగూలీ, ప్రతి ఎన్నికల్లోనూ ఓటు వేయడమే కాకుండా ఓటర్లలో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆయన రాజకీయాల్లో లేకపోయినా, అన్ని పార్టీల నేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయన్న చర్చ తరచూ జరుగుతుంటుంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తోసిపుచ్చిన మమతా బెనర్జీ
టీఎంసీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికే బీజేపీ ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తమ పార్టీ 294 స్థానాలకు గానూ 226 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని, రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భద్రతా దళాలు బీజేపీ ఏజెంట్లుగా పనిచేశారని ఆమె మండిపడ్డారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కాపలా కాయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి? (294 మొత్తం స్థానాలు – మెజారిటీ మార్కు: 148)
| సర్వే సంస్థ | బీజేపీ (అంచనా) | టీఎంసీ (అంచనా) |
| న్యూస్ 18 | 143 – 163 | 127 – 147 |
| టుడేస్ చాణక్య | 192 | 100 |
| పీపుల్స్ పల్స్ | 95 – 110 | 177 – 187 |
| జన్మత్ పోల్స్ | 80 – 90 | 195 – 205 |
| పోల్ డైరీ | 142 – 171 | 99 – 127 |
| మ్యాట్రిజ్ | 146 – 161 | 125 – 140 |
| పి-మార్క్ | 150 – 175 | 118 – 138 |
