న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మంది పేర్ల తొలగింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కొండంత బలాన్ని ఇచ్చింది. ఈ తీర్పుపై దీదీ స్పందిస్తూ.. “నేను చాలా సంతోషంగా ఉన్నాను” (I am so happy) అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌తో నిత్యం పోరాడే మమతను ఇంతలా ఖుషీ చేసిన ఆ తీర్పులో అసలేముంది?
అసలు వివాదం ఏంటి?
బెంగాల్ ఓటర్ల జాబితా ప్రక్షాళన (SIR) పేరుతో అధికారులు భారీ ఎత్తున పేర్లను తొలగించారు. పొరుగు రాష్ట్రాలైన జార్ఖండ్, ఒడిశా జ్యుడీషియల్ అధికారుల సహాయంతో ఏప్రిల్ 2026 మొదటి వారం వరకు సుమారు 60 లక్షల అభ్యంతరాలను పరిశీలించి, లక్షలాది మందిని ‘అనర్హులు’గా తేల్చి జాబితా నుంచి తొలగించారు.
- టీఎంసీ ఆరోపణ: అధికార తృణమూల్ కాంగ్రెస్ దీనిపై తీవ్రంగా మండిపడింది. ఎన్నికల కమిషన్ కావాలనే తమ మద్దతుదారులు, ఒక వర్గం ఓటర్ల పేర్లను తొలగించిందని ఆరోపించింది.
- కోర్టుకు చేరిన పంచాయితీ: ఓటు హక్కు కోల్పోయిన బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది.
సుప్రీంకోర్టు వేసిన మాస్టర్ ప్లాన్!
ఈ కేసు తీవ్రతను గుర్తించిన సుప్రీంకోర్టు తన విశేషాధికారాలను ఉపయోగించి సంచలన నిర్ణయం తీసుకుంది:
- ట్రిబ్యునల్స్ ఏర్పాటు: ఓటర్ల ఫిర్యాదులను విచారించడానికి 19 అప్పీలేట్ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో కలకత్తా హైకోర్టుతో పాటు పొరుగు రాష్ట్రాల మాజీ ప్రధాన న్యాయమూర్తులు, జడ్జిలు సభ్యులుగా ఉంటారు.
- డెడ్‌లైన్ విధింపు: ఈ ట్రిబ్యునల్స్ ఏప్రిల్ 21లోపు అప్పీళ్లను పరిష్కరిస్తే, మొదటి విడత ఎన్నికల్లో వారికి ఓటు హక్కు కల్పించాలని.. ఏప్రిల్ 27లోపు తేలితే రెండో విడతలో అవకాశం ఇవ్వాలని ఆదేశించింది.
- ఈసీపై కండిషన్: ట్రిబ్యునల్ ఒక ఓటరును ‘అర్హుడు’గా తేల్చితే, ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా వారిని అదనపు జాబితాలో చేర్చి ఓటు వేయనివ్వాలని స్పష్టం చేసింది.
మమతా బెనర్జీ సంతోషం వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది:
- వోట్ బ్యాంక్ రక్షణ: ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా తమ మద్దతుదారుల ఓట్లు తొలగించిందని దీదీ ఆరోపించారు. ఇప్పుడు కోర్టు ఏర్పాటు చేసిన స్వతంత్ర ట్రిబ్యునల్ ద్వారా ఆ ఓట్లు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కలగడం టీఎంసీకి పెద్ద ఊరట.
- నైతిక విజయం: ఎన్నికల కమిషన్ పారదర్శకతపై మమత మొదటి నుంచీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈసీ నిర్ణయాన్ని పక్కన పెట్టి, మాజీ జడ్జిల కమిటీకి బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆమె నైతికంగా పైచేయి సాధించినట్లు భావిస్తున్నారు.
