బెంగాల్ బరిలో కాంగ్రెస్ ‘ఒంటరి’ పోరు.. కానీ గాంధీ ఫ్యామిలీ దూరం! దీదీ కోసం రాహుల్-ప్రియంక త్యాగమా? తెర వెనుక లోగుట్టు ఇదేనా..!!

కోల్‌కతా/న్యూఢిల్లీ: ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అభ్యర్థులను నిలబెట్టి ఏకైక పార్టీగా రికార్డు సృష్టించింది. అయితే, క్షేత్రస్థాయిలో అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతుంటే.. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియంక గాంధీ మాత్రం ప్రచారానికి దూరంగా ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

అన్ని సీట్లలో పోటీ.. అయినా ప్రచారానికి నో ఎంట్రీ?

ముర్షిదాబాద్‌లోని బెహరాంపూర్ నుంచి అధీర్ రంజన్ చౌదరి, మాల్దాలోని మాల్తీపూర్ నుంచి మౌసమ్ నూర్ వంటి దిగ్గజాలను కాంగ్రెస్ బరిలోకి దించింది. గతంలో (2021లో) కేవలం 90 సీట్లలో, మొన్నటి లోక్‌సభలో 12 సీట్లలో మాత్రమే పోటీ చేసిన కాంగ్రెస్, ఈసారి అన్ని చోట్లా జెండా పాతాలని చూస్తోంది. కానీ, రాహుల్-ప్రియంకలు మాత్రం ప్రచారానికి వస్తారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.

మమత ‘ముస్లిం ఓట్ల’ భయమే కారణమా?

కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నా, అగ్రనేతల మధ్య ఒక అప్రకటిత ఒప్పందం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

  • ఓట్ల చీలిక: రాహుల్ గాంధీ బెంగాల్‌లో విస్తృతంగా ప్రచారం చేస్తే, బీజేపీ వ్యతిరేక ఓట్లు – ముఖ్యంగా ముస్లిం ఓట్లు – కాంగ్రెస్, టీఎంసీ మధ్య చీలిపోయే అవకాశం ఉంది.
  • బీజేపీకి లాభం: ఓట్లు చీలితే అది అంతిమంగా బీజేపీకి లాభం చేకూరుస్తుందని మమతా బెనర్జీ ఆందోళన చెందుతున్నారు. అందుకే గాంధీ కుటుంబం ప్రచారానికి దూరంగా ఉండాలని దీదీ కోరుకుంటున్నట్లు సమాచారం.
  • కేవలం మొక్కుబడిగా: కేవలం ఫార్మాలిటీ కోసం ఒకటి రెండు చోట్ల రాహుల్ ప్రసంగించి వెళ్ళిపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత చరిత్ర కూడా ఇదే..

ఈ ‘దూరం’ పాటించడం రాహుల్ గాంధీకి కొత్తేమీ కాదు.

  1. 2021 అసెంబ్లీ ఎన్నికలు: 8 దశల్లో ఎన్నికలు జరిగితే, రాహుల్ కేవలం ఒక్క రోజు మాత్రమే వచ్చి రెండు నియోజకవర్గాల్లో (ఉత్తర దినాజ్‌పూర్, డార్జిలింగ్) ప్రచారం చేశారు. తర్వాత కరోనా వంకతో తప్పుకున్నారు.
  2. 2024 లోక్‌సభ ఎన్నికలు: దేశవ్యాప్తంగా 110 సభల్లో పాల్గొన్న రాహుల్, బెంగాల్‌కు మాత్రం కేవలం ఒక్క రోజే పరిమితమయ్యారు.
వ్యూహాత్మక మౌనం!

ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. అక్కడ ముస్లిం ఓటర్లు ఎటువైపు మొగ్గుతారనేది కీలకం. టీఎంసీ అభ్యర్థన మేరకు కాంగ్రెస్ అధిష్టానం కూడా తన ప్రచార వనరులను కేవలం గెలిచే అవకాశం ఉన్న సీట్లకే పరిమితం చేయాలని భావిస్తోంది. అంటే, బయటకు ప్రత్యర్థులుగా కనిపిస్తున్నా.. జాతీయ స్థాయిలో ఇండియా (I.N.D.I.A) కూటమి ప్రయోజనాల కోసం బెంగాల్‌లో కాంగ్రెస్ ‘త్యాగం’ చేస్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

మొత్తానికి, కాంగ్రెస్ అభ్యర్థులు తమ అధినేతల కోసం ఎదురుచూస్తుంటే, అధిష్టానం మాత్రం ‘దీదీ’ సమీకరణాలను బేరీజు వేసుకుంటోంది.


Posted

in

by

Tags: