బీహార్ రాష్ట్రం సీతామర్హి జిల్లాలో, వేగంగా వచ్చిన ఒక స్కార్పియో కారు బైక్‌ను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదం రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డైంది. రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.
బైర్గానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని నంద్వారా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హరిలాల్ ఠాకూర్, మంతేష్ పాశ్వాన్ అనే ఇద్దరు ఒకే బైక్‌పై వెళ్తున్నారు. అప్పుడు అతివేగంగా వచ్చిన ఓ తెల్లటి స్కార్పియో కారు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ ఢీకొట్టిన వేగానికి బైక్‌తో సహా ఇద్దరూ రోడ్డు పక్కన ఉన్న బారికేడ్ల వద్ద గాల్లోకి ఎగిరిపడ్డారని సమాచారం.
ఈ ప్రమాదంలో హరిలాల్ ఠాకూర్, మంతేష్ పాశ్వాన్ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆందోళనగా పరుగులు తీస్తూ వచ్చారు. సమాచారం తెలుసుకున్న ఇద్దరి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో వారి ఇళ్లల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈలోగా ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరుకైన రోడ్డు కావడం, జనావాసాల మధ్య ఉండటంతో.. కారు అంత వేగంగా ఎలా వచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్కార్పియో కారులో వచ్చిన వారు ఎవరు? ప్రమాదం తర్వాత వారు ఏం చేశారు? ఈ ప్రమాదానికి కారణం ఏంటి? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారాయి.

Leave a Reply