CBSE బోర్డు పరీక్షలు 2026: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17, 2026 నుండి ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుండి మార్చి 11 వరకు జరుగుతాయి. విద్యార్థుల కోసం బోర్డు ఈ ఏడాది పలు కీలక మార్పులను ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణల వల్ల పరీక్షల ఒత్తిడి తగ్గడమే కాకుండా, పరీక్షా విధానం కూడా మరింత హైటెక్‌గా మారనుంది.
CBSE తెచ్చిన 5 ప్రధాన మార్పులు:
- 12వ తరగతి పేపర్ల డిజిటల్ మూల్యాంకనం (On-Screen Marking): ఇకపై 12వ తరగతి సమాధాన పత్రాలను డిజిటల్ పద్ధతిలో దిద్దుతారు. జవాబు పత్రాలను స్కాన్ చేసి, పరీక్షకులు కంప్యూటర్ స్క్రీన్‌పై చూస్తూ మార్కులు వేస్తారు. దీనివల్ల ఫలితాలు వేగంగా రావడమే కాకుండా, మానవ తప్పిదాలు తగ్గుతాయి.
- 10వ తరగతికి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు: 10వ తరగతి విద్యార్థులకు ఒకే విద్యా సంవత్సరంలో రెండుసార్లు బోర్డు పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. మొదటి పరీక్ష అందరికీ తప్పనిసరి. ఎవరైనా విద్యార్థి మార్కులు మెరుగుపరుచుకోవాలనుకుంటే రెండో పరీక్ష రాయవచ్చు. రెండింటిలో మెరుగైన మార్కులను తుది ఫలితాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
- ప్రశ్నపత్రం శైలిలో మార్పు: విద్యార్థుల విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. కేస్ స్టడీ ప్రశ్నలు, మల్టిపుల్ ఛాయిస్ (MCQ) మరియు వివరణాత్మక ప్రశ్నల మిశ్రమంతో పేపర్ ఉంటుంది. బట్టీ పట్టే విధానానికి బదులు అవగాహనపై దృష్టి పెట్టడమే దీని ఉద్దేశ్యం.
- సైన్స్ మరియు సోషల్ పేపర్లలో సెక్షన్ వారీగా సమాధానాలు: 10వ తరగతి సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షల్లో ఒక కొత్త నియమాన్ని తెచ్చారు. ఏ సెక్షన్‌కు సంబంధించిన ప్రశ్నలకు ఆ సెక్షన్లోనే సమాధానాలు రాయాలి. ఒక సెక్షన్ జవాబును మరో సెక్షన్లో రాస్తే, ఆ ప్రశ్నను పరిగణనలోకి తీసుకోరు (దిద్దరు).
- కఠినమైన నిబంధనలు మరియు క్రమశిక్షణ: పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయం కంటే ముందే చేరుకోవాలి. స్మార్ట్ వాచ్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై పూర్తి నిషేధం ఉంటుంది. పారదర్శకత కోసం నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు.
