ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ జట్ల మధ్య న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ మైదానంలో నాలుగు రోజుల రెండో (అనధికారిక) టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతోంది.
మ్యాచ్‌లోని ఒక దశలో, న్యూజిలాండ్-ఏ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ రాండెల్ బౌలింగ్ చేసేందుకు తన రనప్ ప్రారంభించాడు. మరోవైపు భారత బ్యాట్స్‌మన్ ఆకాశ్ దీప్ బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడు.
బౌలర్ బంతిని వేయడానికి పరుగెత్తుకుంటూ వస్తున్న ఆ సమయంలో, ఊహించని విధంగా మైదానంలోకి ప్రవేశించిన ఓ వృద్ధుడు, తన మోటార్ స్కూటర్‌పై సైట్ స్క్రీన్ ముందు నుంచి అడ్డంగా వెళ్లాడు. బ్యాట్స్‌మన్ కంటిచూపు (లైన్ ఆఫ్ సైట్)కు అడ్డుగా ఆ వృద్ధుడు అకస్మాత్తుగా కనిపించడంతో, అప్రమత్తమైన ఆకాశ్ దీప్ వెంటనే బౌలర్‌ను మధ్యలోనే ఆపేశాడు. దీంతో బంతి వేయడాన్ని మధ్యలోనే ఆపేసిన బ్రెట్ రాండెల్.. అసలేం జరుగుతుందో అర్థంకాక గందరగోళానికి గురయ్యాడు.
అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందన్న విషయం కూడా గమనించకుండా, ఆ వృద్ధుడు ఎంతో క్యాజువల్‌గా తన స్కూటర్‌పై మైదానాన్ని దాటి వెళ్లిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. వర్షం, వెలుతురు లేమి లేదా ప్రేక్షకులు మైదానంలోకి దూసుకురావడం వంటి సాధారణ కారణాల వల్ల ఆట ఆగిపోవడం సహజమే అయినప్పటికీ, ఇలా సైట్ స్క్రీన్ ముందు స్కూటర్‌పై ఓ వృద్ధుడు చక్కర్లు కొట్టడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటనగా మారింది.
తీవ్రంగా సాగుతున్న మ్యాచ్ వాతావరణంలో అకస్మాత్తుగా జరిగిన ఈ చిన్న విరామం, మైదానంలోని ఆటగాళ్లను, అభిమానులను నవ్వించింది. ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారి క్రికెట్ అభిమానులకు హాట్ టాపిక్‌గా నిలవడమే కాకుండా.. సోషల్ మీడియాలో తీవ్ర నవ్వులు పూయిస్తోంది.

Leave a Reply