భారతదేశంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాల దిగుమతులను నియంత్రించడానికి మరియు దేశీయ మార్కెట్‌ను క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ కీలక చర్యలు తీసుకుంటోంది.
ఇందులో భాగంగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దేశంలోని ప్రధాన బ్యాంకులకు ఒక అత్యవసర ఉత్తర్వు జారీ చేసింది. గత 2023 సంవత్సరం నుండి బ్యాంకులు మంజూరు చేసిన ‘గోల్డ్ మెటల్ లోన్’ (Gold Metal Loan – GML) మరియు ‘లోన్ ఎగైనెస్ట్ గోల్డ్’ (Loan against Gold – బంగారు నగల రుణాలు) కి సంబంధించిన పూర్తి డేటాను వెంటనే తమకు సమర్పించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ హఠాత్తు నిర్ణయం.. బంగారంపై త్వరలోనే కొత్త మరియు కఠినమైన ఆంక్షలు రాబోతున్నాయనడానికి ప్రాథమిక సంకేతం కావచ్చని ఆర్థిక నిపుణుల మధ్య జోరుగా చర్చ సాగుతోంది.
ఈ రెండు రుణాల మధ్య వ్యత్యాసం ఏంటి?
- గోల్డ్ మెటల్ లోన్ (GML): పెద్ద పెద్ద జ్యువెలరీ దుకాణదారులు లేదా తయారీదారులు తమ వ్యాపార అవసరాల కోసం బ్యాంకు నుండి బంగారు బిస్కెట్లను (బార్స్) రుణం రూపంలో పొందడం.
- లోన్ ఎగైనెస్ట్ గోల్డ్: సామాన్య ప్రజలు తమ అత్యవసరాల కోసం ఇంట్లోని బంగారు నగలను బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బును రుణంగా తీసుకోవడం. ఈ రెండింటికీ చాలా పెద్ద వ్యత్యాసం ఉంది.
బ్యాంకులకు చేరిన అత్యవసర లేఖ
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం (DFS) గత శుక్రవారం సాయంత్రం అన్ని వాణిజ్య బ్యాంకులకు అత్యవసర లేఖ పంపింది. ఆ ఆదేశాల ప్రకారం.. బ్యాంకులు మంజూరు చేసిన బంగారు రుణాల మొత్తం విలువ మరియు పరిమాణం, రుణం పొందిన కస్టమర్ల సంఖ్య, అంతర్జాతీయ బంగారం సరఫరాదారుల వివరాలు, బ్యాంకుల ప్రస్తుత గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో పరిమాణం, అందుకోసం తీసుకున్న తాకట్టు (Collateral) విలువ మరియు మొత్తం రుణగ్రహీతల సంఖ్య వంటి అన్ని వివరాలను బ్యాంకులు సోమవారంలోగా సమర్పించాలని గడువు విధించింది.
కొన్ని బ్యాంకుల నుండి నెలవారీ ఖచ్చితమైన గణాంకాలను (డేటాను) కూడా కోరారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ కీలక నిర్ణయానికి ముందే, భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా గోల్డ్ మెటల్ లోన్ అవసరాల నివేదికను సమర్పించాలని బ్యాంకులను కోరడం ఇక్కడ గమనార్హం.
అసలు నేపథ్యం ఏంటి?
బంగారు దిగుమతి సుంకాన్ని (ఇంపోర్ట్ డ్యూటీ) 15 శాతానికి పెంచడం, వెండి దిగుమతులపై ఆంక్షలు విధించిన తర్వాత ఈ విధమైన చర్యలు చేపట్టడం చూస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం బంగారంపై కొత్త నిబంధనలు లేదా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి.
సాధారణంగా భారతదేశంలో జూన్ మరియు జూలై నెలల్లో బంగారం దిగుమతులు తక్కువగా ఉంటాయి కాబట్టి, ఈ సమయంలో కొత్త మార్గదర్శకాలను (గైడ్‌లైన్స్) తీసుకురావడానికి ఇది సరైన తరుణమని కొందరు బ్యాంక్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
బంగారు దిగుమతి సుంకం పెంచిన తర్వాత కూడా మార్కెట్లో ఉన్న కొన్ని లోపాలను (లూప్‌హోల్స్) సరిదిద్దడానికే ఈ కొత్త డేటా సేకరణ ప్రక్రియను చేపట్టినట్లు ఒక సీనియర్ బ్యాంక్ అధికారి తెలిపారు.

Leave a Reply