బ్యాంకుల్లో బంగారు రుణాలు తీసుకున్నారా? ఫిబ్రవరి 1 నుండి కొత్త నిబంధనలు రాబోతున్నాయా?

భారతదేశంలో బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, ఒక గొప్ప పెట్టుబడిగా కూడా పరిగణించబడుతుంది. అత్యవసర సమయాల్లో ఎక్కడా అప్పు దొరకని పక్షంలో, బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్న అలవాటు.

అందుకే చాలామంది బంగారు ఆభరణాలను కొనడానికి ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం బంగారం ధరలు రోజురోజుకూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో బంగారు రుణాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం వంటి బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు (NBFCలు), గోల్డ్ లోన్ విధానాల్లో కొన్ని మార్పులు వస్తే సామాన్యులకు మరింత తక్కువ వడ్డీకే రుణాలు అందించవచ్చని భావిస్తున్నాయి.

మార్పులు వస్తాయా?
బ్యాంకులకు లభించే ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ (PSL) వంటి ప్రోత్సాహకాలు తమకు లభించడం లేదని బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు వాదిస్తున్నాయి. దీనివల్ల ప్రజలకు రుణాలు అందించే ఖర్చు పెరుగుతుందని, ఆ భారాన్ని కస్టమర్లపైనే వేయాల్సి వస్తోందని పేర్కొంటున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి, బ్యాంకులకు ఇచ్చే రాయితీలను తమకు కూడా వర్తింపజేయాలని అవి కోరుతున్నాయి. అంతేకాకుండా, UPI ద్వారా గోల్డ్-లింక్డ్ క్రెడిట్ లైన్ (బంగారం ఆధారిత క్రెడిట్ సౌకర్యం) తీసుకురావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి.

వడ్డీ రేట్లు తగ్గుతాయా?
ఒకవేళ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ ప్రోత్సాహకాలు NBFCలకు లభిస్తే, నిధుల సమీకరణ ఖర్చు తగ్గుతుంది. ఫలితంగా తక్కువ వడ్డీకే ప్రజలకు బంగారు రుణాలు అందించడం సాధ్యమవుతుంది. నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే బంగారాన్ని తాకట్టు పెట్టే అలవాటు ఎక్కువగా ఉంది. అక్కడ వడ్డీ రేట్లు తగ్గితే సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుంది. గోల్డ్ లోన్ అనేది సురక్షితమైన (Secured Loan) రుణం కాబట్టి, ఇందులో నిబంధనలను సడలిస్తే రుణ సామర్థ్యం మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆర్‌బీఐ (RBI) నిబంధనలు
గతేడాది బంగారు రుణాలపై ఆర్‌బీఐ పలు మార్పులు చేపట్టింది. ఈసారి బడ్జెట్‌లో మరిన్ని మార్పులు ఉండవచ్చని సమాచారం. ముఖ్యంగా 2 లక్షల రూపాయల కంటే తక్కువ రుణం తీసుకునే వారికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తులు అందుతున్నాయి.

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో బంగారు రుణాలపై వచ్చే మార్పులు ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి, కొత్తగా తీసుకోవాలనుకునే వారికి ఎంతో కీలకం. సాధారణంగా వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, వ్యవసాయం లేదా భూమి కొనుగోలు కోసం ప్రజలు ఈ రుణాలు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పేద ప్రజలకు అనుకూలంగా ఉంటాయో లేదో వేచి చూడాలి.


Posted

in

by

Tags: