ఒక వ్యాపారవేత్తను ‘డిజిటల్ అరెస్ట్’ చేస్తామని బెదిరించి, ఆయన దగ్గరి నుంచి 21 లక్షల రూపాయలను ఓ సైబర్ నేరగాళ్ల ముఠా దోచుకున్న దిగ్భ్రాంతికర సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నకిలీ పత్రాలు, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు గుంజుతున్న సైబర్ నేరగాళ్ల ఈ కొత్త వ్యూహం, వ్యాపారులు మరియు పారిశ్రామికవేత్తల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తోంది.
బాధితుడైన వ్యాపారవేత్తకు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు, తమను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), పోలీస్ ఉన్నతాధికారులుగా పరిచయం చేసుకున్నారు. ఆయన పేరు మీద వచ్చిన ఒక పార్శిల్లో మత్తుపదార్థాలు, చట్టవిరుద్ధమైన పత్రాలు ఉన్నాయని చెప్పి బెదిరించారు.
ఆ తర్వాత ఆయన్ను వీడియో కాల్లోకి రావాలని బలవంతం చేసి, “మిమ్మల్ని అరెస్టు చేశాం, విచారణ ముగిసే వరకు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు, కెమెరా ముందు నుంచి కదలకూడదు” అని చెప్పి ఆయన్ను మానసికంగా తీవ్ర ఒత్తిడికి, భయానికి గురిచేశారు.
ఈ కేసు నుంచి బయటపడాలంటే, ఆయన బ్యాంకు ఖాతాలోని డబ్బును “వెరిఫికేషన్ (సరిచూడటం)” కోసం వెంటనే తమ ఖాతాకు బదిలీ చేయాలని ఆ మోసగాళ్ల ముఠా చెప్పింది. ఆ నకిలీ అధికారుల బెదిరింపులను నిజమని నమ్మిన వ్యాపారవేత్త, భయంతో తన పొదుపు ఖాతాలోని 21 లక్షల రూపాయలను వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు.
డబ్బు బదిలీ అయిన కొద్దిసేపటికే ఆ వ్యక్తులు కాల్ కట్ చేయడంతో.. తాను మోసపోయానని గ్రహించిన వ్యాపారవేత్త వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply