మహారాష్ట్రలోని థానే జిల్లా డోంబివలి ప్రాంతంలో ప్రియురాలు విడిపోయిందన్న కోపంతో ఓ యువకుడు ఆమె ఇంటికే నిప్పు పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
దీపేష్ రస్తోగి అనే యువకుడు, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి గత ఏడెనిమిది ఏళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం.
ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య తరచూ మనస్పర్థలు, గొడవలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఆ యువతి ప్రేమ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దీపేష్ రస్తోగి, ఆ యువతి ఇంటికి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది.
నిప్పు పెట్టిన సమయంలో ఆ యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే ఉంది. ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో లోపల ఉన్న ముగ్గురి ప్రాణాలకు పెను ప్రమాదం ఏర్పడింది. అయితే, వెంటనే అప్రమత్తమైన వారు సకాలంలో ఇంటి నుంచి బయటకు రావడంతో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఘటనపై సమాచారం అందుకున్న మాన్పాడా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం ఇంటికి నిప్పు పెట్టిన ఆరోపణలపై దీపేష్ రస్తోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కుటుంబ సభ్యులందరికీ హాని తలపెట్టాలనే ఉద్దేశంతోనే అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు ఇంటికే నిప్పు పెట్టిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Leave a Reply