భక్తులకు నీరే ప్రసాదం: ఈ వింత ఆలయం గురించి తెలుసా?

గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో శ్రీకృష్ణుని భార్య రుక్మిణీ దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం దాదాపు 2500 ఏళ్ల పురాతనమైనదిగా భావిస్తారు.

ఆలయ విశిష్టత: ప్రస్తుత ఆలయ నిర్మాణం 19వ శతాబ్దానికి చెందినదిగా కనిపిస్తున్నప్పటికీ, గోపురాలపై ఉన్న శిల్పకళను బట్టి ఇది 12వ శతాబ్దానికి చెందినది కావచ్చని నమ్ముతారు. గర్భాలయంలో రుక్మిణీ దేవి పాలరాతి విగ్రహం ఉంటుంది. ఆమె చేతుల్లో శంఖం, చక్రం, గద మరియు పద్మం కనిపిస్తాయి. ద్వారకా యాత్ర పూర్తి కావాలంటే, కృష్ణుడి దర్శనం తర్వాత తప్పనిసరిగా రుక్మిణీ దేవిని దర్శించుకోవాలని చెబుతారు.

నీటి ప్రసాదం (జల్ దాన్): ఈ ఆలయంలో భక్తులకు ‘నీటిని’ ప్రసాదంగా ఇస్తారు. ఇలా నీటిని ప్రసాదంగా ఇవ్వడం మరే ఇతర ఆలయంలోనూ కనిపించదు. అందుకే ఇది ఎంతో వింతగా అనిపిస్తుంది.

పురాణ గాథ: శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీ దేవి ఒకసారి దూర్వాస మహామునిని విందుకు ఆహ్వానించడానికి వెళ్లారు. దూర్వాసుడు ఒక షరతు పెట్టాడు: తన రథాన్ని కృష్ణుడు, రుక్మిణి ఇద్దరూ కలిసి లాగాలి. దానికి అంగీకరించిన వారు రథాన్ని లాగుతుండగా, దారిలో రుక్మిణికి విపరీతమైన దాహం వేసింది. అప్పుడు శ్రీకృష్ణుడు తన కాలి బొటనవేలితో భూమిని నొక్కగా గంగమ్మ ఉద్భవించింది.

అయితే, అతిథిగా వచ్చిన తనకు నీరు ఇవ్వకుండానే రుక్మిణి నీరు తాగడంతో కోపించిన దూర్వాస మహాముని.. కృష్ణుడు, రుక్మిణి విడివిడిగా ఉండాలని శపించారు. ఆ శాపం వల్లే ద్వారకాధీశుడి ఆలయానికి దూరంగా రుక్మిణికి విడిగా ఆలయం ఏర్పడింది. దూర్వాసుడి శాపం వల్ల ఇప్పటికీ ఈ ఆలయం ఉన్న పరిసరాల్లో మంచి నీరు దొరకదు, కేవలం ఉప్పు నీరు మాత్రమే లభిస్తుంది.



Posted

in

by

Tags: